మసూద్‌ ఆస్తుల స్తంభనకు ఫ్రాన్స్‌ సంసిద్ధం​

15 Mar, 2019 13:45 IST|Sakshi

పారిస్‌ : జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్న భారత్‌కు ఆ దిశగా భారీ ఊరట లభించింది. మసూద్‌ అజర్‌ ఆస్తులను స్తంభింపచేస్తామని శుక్రవారం ఫ్రాన్స్‌ ప్రకటించింది. ఈ దిశగా ఫ్రాన్స్‌ దేశీయాంగ, ఆర్థిక, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన చేశాయి. ఉగ్రవాదంతో ప్రమేయమున్న వ్యక్తిగా మసూద్‌ అజర్‌ పేరును ఐరోపా యూనియన్‌ జాబితాలో చేర్చేందుకు ఫ్రాన్స్‌ చొరవ చూపుతుందని అధికారిక ప్రకటన వెల్లడించింది.

కాగా మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని ఫ్రాన్స్‌, బ్రిటన్‌, అమెరికా ఇప్పటికే కోరుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు పాకిస్తాన్‌ను తమ భూభాగంలో జైషే మహ్మద్‌ సహా ఉగ్రవాద కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పలు ప్రపంచ దేశాలు ఇస్లామాబాద్‌పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిపై జైషే మహ్మద్‌ పాల్పడిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించిన నేపథ్యంలో పాకిస్తాన్‌లో ఉగ్రశిబిరాలపై భారత్‌ మెరుపు దాడులు చేపట్టడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు