వారానికి ఒక్కసారైనా ఏడవాల్సిందే!

26 Dec, 2018 22:23 IST|Sakshi

సాక్షి, వెబ్‌డెస్క్‌ : సుఖ - దుఃఖాల కలయికే జీవితం అంటారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందం, బాధ రెండూ ఉంటాయి. ప్రతి ఒక్కరు తమ జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు.  సినిమాలు, ఆటలు, పాటలు, స్నేహితులతో కబుర్లు, విహారయాత్రల్లో కొంతమంది ఆనందాన్ని వెతుక్కుంటే.. మరికొంతమంది అందరితో కలిసి పంచుకునే ఆనందం కంటే, వ్యక్తిగత ఆనందానికే పెద్దపీట వేస్తుంటారు. ఇక విషాదం విషయానికి వస్తే.. కొంతమంది బోరున ఏడ్చేస్తే, మరికొంత మంది లోలోపలే కుమిలిపోతుంటారు. ఉబికివస్తోన్న భావోద్వేగాలను అణచుకుంటారే తప్ప.. ఏడవడానికి సాహసించరు. కన్నీళ్లు కార్చడం ఓ పిరికిపంద చర్య అని, ఎవరేమనుకుంటారోనని, అందరి ముందు ఏడవడానికి వెనుకంజ వేస్తుంటారు. బాధను మర్చిపోయి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. నవ్వుతూ ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటారని చెబుతుంటారు. అయితే, నవ్వడం వల్ల శరీరానికి కలిగే మేలు సంగతిని కాసేపు పక్కన పెడితే... ఏడుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదని, దానివల్ల ఒత్తిడి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

ఏడవండి... బాగా ఏడవండి
ఆనందాన్ని నలుగురితో పంచుకొని..బాధను మనలోనే ఉంచుకోవాలంటారు. కానీ ఇది తప్పు అంటున్నారు జపాన్‌కు చెందిన హైస్కూల్ టీచర్ హీదెఫూమీ యోషిదా. ఏడవండి.. బాగా ఏడవండి.. ఏడవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. నవ్వడం కంటే ఏడవడం వల్లే ఎక్కువ ఒత్తిడి తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. ఈ విషయం ప్రయోగాత్మకంగా నిరూపించడం జరిగిందని వెల్లడించారు. వారానికి ఒక్కసారైనా గట్టిగా ఏడవడం వల్ల ఒత్తిడి తగ్గి ఆరోగ్యంగా ఉండవచ్చని చెబుతున్నారు.

ఎవరీ హీదెఫూమీ యోషిదా..?
హీదెఫూమీ యోషిదా (43) జపాన్‌కు చెందిన టీచర్‌. గత కొన్నేళ్లుగా ఏడవడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఆయన పరిశోధనలు సాగిస్తున్నారు. అంతేకాదు ఈ విషయమై ఉపన్యాసాలు ఇస్తూ... ఎలా ఏడవాలో అన్న అంశంపై శిక్షణ కూడా ఇస్తున్నారు. ‘నామిదా సెంసోయీ’ (టియర్స్ టీచర్‌)గా పేరు గాంచిన ఈయన ఇప్పటికే అనేక మంది విద్యార్థులకు, ఉద్యోగులకు ఏడుపులోని పరమార్థాన్ని వివరించి.. వారిని ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. అంతేకాకుంగా 2014లో తోహో యూనివర్సీటీకి చెందిన ప్రొఫెసర్‌ హితేహో అరితాతో జతకట్టి ‘ఏడవడం వల్ల ఒత్తిడి ఎలా తగ్గించుకోవచ్చు’ అనేదానిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా యోషిదా ప్రచారం ఓవైపు... ప్రతి కంపెనీలోని ఉద్యోగికి ఒత్తిడి చెకప్‌ చేయించుకోవాలంటూ జపాన్‌ ప్రభుత్వం నిబంధన మరోవైపు వెరసి జపాన్‌లో ఆత్మహత్యల సంఖ్య గణనీయంగా తగ్గింది.

ఒత్తిడి తగ్గింపునకు జపాన్‌ కొత్త ప్రయత్నం
సాధారణంగా జపనీయులు కష్టజీవులు. తక్కుత విశ్రాంతి తీసుకొని ఎక్కువ కష్టపడుతుంటారు. అయితే ఈ నేపథ్యంలో వారు ఎంతో ఒత్తిడికి కూడా గురవుతుంటారు. ఇక్కడి ఉద్యోగులతో పాటు విద్యార్థులు కూడా ఎంతో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. తాజాగా జపాన్‌లో ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొత్త పద్దతిని ప్రవేశపెట్టారు. ఒత్తిడిని తప్పించుకునేందుకు వారు నవ్వుకు బదులు ఏడవడంపై దృష్టిపెట్టారు. ఇక్కడి కంపెనీల్లోని ఉద్యోగులను, స్కూళ్లలోని విద్యార్థులను వారంలో ఒకరోజు ఒక చోటచేర్చి పెద్ద పెట్టున ఏడ్చే విధంగా  ప్రోత్సహిస్తున్నారు. ఏడుపుపై శిక్షణ ఇచ్చేందుకు ట్రైనర్లను కూడా నియమిస్తున్నారు. జపాన్‌తో పాటు చాలా దేశాలు ఒత్తిడి తగ్గించడం కోసం ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి.

దక్షిణ కొరియా నంబర్‌వన్‌...
ప్రపంచంలో దాదాపు 90శాతం మంది డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆ సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. మానసిక అనారోగ్యానికి గురవుతున్న వారిలో సగం శాతం మంది 14 ఏళ్ల వయసు వారే ఉండటం గమనార్హం. వారిలో చాలా మందికి చికిత్స అందటం లేదు.15-29 ఏళ్ల వయసు వాళ్లే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సంస్థ వెల్లడించింది. కాగా ఒత్తిడిని తగ్గించి ఆత్మహత్యలను నిలువరించేందుకు జపాన్‌ ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికి.. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే జపాన్‌లోనే సూసైడ్‌ కేసులు ఎక్కువగానే నమోదవుతున్నాయి. 2003లో చనిపోయిన వారిలో 38 శాతం మంది ఆత్మహత్యలే చేసుకుని మరణించిన వారేననని సర్వేలో తేలింది. 2017 సంవత్సరంలో దాదాపు 21,321 ఆత్మహత్య కేసులు నమోదయ్యాయి. ప్రతీ లక్ష మందిలో 16.6శాతం మంది ఆత్మహత్యలు చేసుకొనే చనిపోతున్నారు. ఆత్మహత్య కేసులు ఎక్కువగా నమోదైన దేశాల్లో దక్షిణ కొరియా (25.8శాతం)  మొదటి స్థానంలో, రష్యా (19.3శాతం)  రెండో స్థానంలో ఉండగా జపాన్‌ మూడో స్థానంలో నిలిచింది.

కన్నీళ్లు మూడు రకాలు...
ఏడవడం వలన కలిగే ప్రయోజనాల గురించి సాగించిన పరిశోధనల్లో దీనివలన సత్ఫలితాలుంటాయిని తేలిందట. మన కంటి నుంచి  మూడు రకాలుగా కన్నీళ్లు వస్తాయట. ఒకటి అంసకల్పికంగా వచ్చే కన్నీళ్లు. ఇది ఇతరులు మనకు చికాకు తెప్పిచ్చినప్పుడు వస్తాయి. రెండోది సాధారణం కన్నీళ్లు ఒక్కొసారి అనుకోకుండా మన కంటి నీళ్లు కారుతుంటాయి. ఇవి మన కంటిని తడిగా ఉంచుతాయి. మూడోది ఎమోషనల్‌ కన్నీళ్లు.. బాధ, ఒత్తిడికి గురైనప్పుడు వస్తాయి. ఇలా వచ్చిన కన్నీళ్లు ఆరోగ్యానికి మంచివట. మన శరీరం నుంచి చెమట రూపంలో మలినాలు ఏవిధంగా బయటకు పోతాయో...ఒత్తిడికి గురైనప్పుడు కూడా ఏడిస్తే అది గుండెల నుంచి మోయలేని భారాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉంచుతుందట. అందుకే ఇటీవలి కాలంలో మానసిక వైద్యులు తమ దగ్గరకు వచ్చే రోగులకు... రోదించాలని సలహా ఇస్తున్నారు. ఏదేమైనా ఏడుపు  ఒత్తిడి తగ్గించి ఆరోగ్యాన్ని కాపాడుతుంది కాబట్టి హాయిగా తనివితీరా ఏడిచి ఆరోగ్యంగా ఉండండి.
- అంజి శెట్టె, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

మరిన్ని వార్తలు