సిగరెట్‌ కోసం బయటకు.. రూ.11వేల ఫైన్‌

6 Apr, 2020 15:07 IST|Sakshi

పారిస్‌ : కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తరుణంలో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల్లో చాలా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించాయి. అయితే ప్రభుత్వాలు ఎన్ని కట్టు దిట్టమైన చర్యలు తీసుకున్నా వాటిని అతిక్రమిస్తున్నవారి సంఖ్యకూడా పెరుగుతూనే ఉంది. ఫ్రాన్స్‌లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఓ యువకుడికి సిగరెట్లు దొరక్కపోవడంతో ఏకంగా ఓ భారీ సాహసానికే ఒడిగట్టాడు. అది విఫలమవ్వడంతో అంతే భారీగా జరిమానును కూడా కట్టాడు.   

స్పెయిన్‌లో కాటలోనియాలోని లాజోన్‌క్వెరా గ్రామంలో సిగరెట్లు విరివిగా దొరకడమే కాకుండా ధర కూడా తక్కువ కావడంతో ఫ్రాన్స్‌కి చెందిన యువకుడు అక్కడికి వెళ్లాలనుకున్నాడు. ముందుగా ఫ్రాన్స్‌లోని తన స్వస్థలమైన పెర్‌పిగ్‌నన్‌ నుంచి కారులో బయలుదేరాడు. అయితే మధ్యలోనే పోలీసులు అడ్డుకోవడంతో వెనుదిరిగినా, సిగరెట్లపై ఆశమాత్రం చావలేదు. ఎలాగైన సిగరెట్‌ తాగాలనే పిచ్చితో ఏకంగా పోలీసుల కళ్లుగప్పి  పైరెనీస్‌ పర్వతాల గుండా స్పెయిన్‌కు వెళ్లాలని భావించాడు.

కొద్ది దూరం వెళ్లిన తర్వాత అతను పట్టుతప్పి లోయలో పడ్డాడు. దీంతో ఏం చేయాలో పాలుపోక సహాయం కోసం తన ఫోన్‌ నుంచి అత్యవసర సిబ్బందికి మెసేజ్‌ చేశాడు. వెంటనే హెలీకాప్టర్‌లో సంఘటనా స్థలానికి చేరుకున్న ఫ్రెంచ్‌ మౌంటైన్‌ పోలీసులు ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా అతన్ని కాపాడారు. లాక్‌ డౌన్‌ సమయంలో నిబంధనలను అతిక్రమించినందుకుగానూ అతనికి 120 పౌండ్‌లు(దాదాపు 11,300 రూపాయలు)జరిమానా విధించారు. కాగా, ఫ్రాన్స్‌లో 70వేల మందికి పైగా కరోనా వ్యాధి బారినపడగా, 8వేల మందికి పైగా మరణించారు. ఇక పక్కనే ఉన్న స్పెయిన్‌లో 1 లక్ష 30 వేలకు పైగా కరోనా కేసులు నమోదవ్వగా, 12 వేల మందికిపైగా మరణించారు.

>
మరిన్ని వార్తలు