కరోనా పేషెంట్లకు నికోటిన్‌ ప్యాచ్‌లు!

24 Apr, 2020 11:23 IST|Sakshi

పారిస్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ సోకకుండా.. దాని ప్రభావాన్ని తగ్గించే శక్తి నికోటిన్‌కు ఉందట. పొగతాగని వారితో పోలిస్తే సిగరెట్లు తదితర పొగాకు ఉత్పత్తులు సేవించే వారిపై మహమ్మారి తక్కువ ప్రభావం చూపిస్తుందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే అంటున్నారు ఫ్రాన్స్‌ పరిశోధకులు. మేజర్‌ పారిస్‌ ఆస్పత్రిలో ఈ మేరకు తాము జరిపిన పరిశోధనల్లో పొగాకులోని నికోటిన్‌ కరోనా సోకకుండా అడ్డుపడుతున్న విషయం వెల్లడైందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ నుంచి ఆమోదం లభిస్తే పేషెంట్లతో పాటు వైద్య సిబ్బందికి కూడా నికోటిన్‌ ప్యాచులు(నికోటిన్‌ నింపిన బ్యాండేజ్‌ వంటి అతుకు) ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కేవలం స్మోక్‌ చేసే అలవాటు ఉన్న వారిపై క్లినికల్‌ ట్రయల్స్‌ చేసే అవకాశం ఉందని తెలిపారు. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పొగతాగమని ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. స్మోకింగ్‌ కారణంగా ఊపిరితిత్తులు పాడైపోయి చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. (అందుకే నీటి సరఫరాను నిలిపివేశాం: ఫ్రాన్స్‌)

ఈ విషయం గురించి ఫ్రెంచ్‌ న్యూరోబయోలజిస్ట్‌ జీన్‌ పెర్రె చాంగెక్స్‌ మాట్లాడుతూ... కరోనా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించకుండా నికోటిన్‌ అడ్డుకునే అవకాశాలు ఉన్నట్లు తమ పరిశోధనలో తేలిందన్నారు. నికోటిన్‌ సెల్‌ రెసెప్టార్స్‌ను అంటిపెట్టుకుని ఉండటం వల్ల శరీరంలో వైరస్‌ను ప్రవేశించకుండా అడ్డుకుంటోందని పేర్కొన్నారు. కాగా మార్చిలో ప్రచురించిన చైనీస్‌ అధ్యయనంలో కూడా పరిశోధకులు ఇదే తరహా అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా సోకిన ప్రతీ వెయ్యి మందిలో పొగతాగేవారు 12.6 శాతం ఉండగా... ధూమపానం చేయని వారు 28 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. (కోవిడ్‌ చికిత్సకు హెచ్‌సీక్యూ–ఐజీ)

ఇక ఫ్రాన్స్‌ గణాంకాల ప్రకారం పారిస్‌లో కరోనాతో ఆస్పత్రిపాలైన 11 వేల మంది రోగుల్లో 8.5 శాతం మంది స్మోకర్లు కాగా... దేశవ్యాప్తంగా వీరి సంఖ్య 25.4 శాతంగా ఉంది. ఈ గణాంకాలను బట్టి నికోటిన్‌ తీసుకునే వారిపై కరోనా ప్రభావం తక్కువగా ఉన్నట్లు అంచనా వేసినట్లు తాజా అధ్యయనం పేర్కొంది. ఇదిలా ఉండగా.. పొగతాగడం వల్ల ఫ్రాన్స్‌లో ఏడాదికి సగటున దాదాపు 75 వేల మంది మృత్యువాత పడుతున్నారు. ఇక కరోనాతో ఇప్పటి వరకు ఫ్రాన్స్‌లో దాదాపు 21 వేల మంది మరణించారు. 

మరిన్ని వార్తలు