జాగింగ్‌ చేస్తూ సరిహద్దులు దాటేసింది!

25 Jun, 2018 02:38 IST|Sakshi

వాషింగ్టన్‌: బీచ్‌లో జాగింగ్‌ చేస్తూ ఓ యువతి అనుకోకుండా దేశ సరిహద్దులనే దాటేసింది.ఫ్రాన్సుకు చెందిన సిండెల్లా రోమన్‌(19) ఈ ఏడాది మేలో కెనడాలోని బ్రిటిష్‌ కొలంబియా రాష్ట్రం వైట్‌రాక్‌ ప్రాంతంలో ఉంటున్న తన తల్లిని కలుసుకునేందుకు వచ్చింది. సముద్ర తీరంలో జాగింగ్‌ చేస్తూ.. కెనడా సరిహద్దు దాటి అమెరికాలో ప్రవేశించింది. ఆమె వద్ద గుర్తింపు పత్రాలు లేకపోవడంతో గస్తీ దళాలు అక్కడికి 200 కిలోమీటర్ల దూరంలో అక్రమ వలసదారుల కోసం ఏర్పాటుచేసిన డిటెన్షన్‌ సెంటర్‌కు తీసుకెళ్లారు. చివరకు ఆమె తన తల్లి క్రిస్టిన్‌ ఫెర్న్‌కు ఫోన్‌ చేసి విషయం తెలిపారు. ఆమె వెంటనే పాస్‌పోర్టు, ఇతర పత్రాలను తీసుకొచ్చి అధికారులకు చూపించినా.. వాటిపై కెనడా అధికారుల ధ్రువీకరణ లేదని మెలికపెట్టారు. రెండు వారాల పాటు సిండెల్లాను అక్కడే ఉంచారు. అవసరమైన పత్రాలను అందజేశాక జూన్‌ 6వ తేదీన ఆమెను వదిలిపెట్టారని కెనడా మీడియా తెలిపింది.

మరిన్ని వార్తలు