ప్రార్థనలు.. ప్రశాంతం!

10 Aug, 2019 04:32 IST|Sakshi
కశ్మీర్‌లో శుక్రవారం ప్రార్థనలు ముగిశాక వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్తున్న స్థానికులు

కశ్మీర్‌లో శుక్రవారం ఆంక్షలను ఎత్తివేసిన ప్రభుత్వం

భారత్‌–పాక్‌లు సిమ్లా ఒప్పందాన్ని అనుసరించాలి: గ్యుటెరస్‌

శ్రీనగర్‌/న్యూఢిల్లీ/ఐరాస/వాషింగ్టన్‌: కశ్మీర్‌లో ప్రార్థనలు చేసుకునేందుకు ప్రభుత్వం శుక్రవారం ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రజలు శాంతియుతంగా మసీదుల్లో ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోపోర్‌సహా కొన్నిచోట్ల అల్లరిమూకలు భద్రతాబలగాలపై రాళ్లు విసరగా, వారిని బలగాలు చెదరగొట్టాయి. కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి, ప్రత్యేక హోదా కల్పిస్తున్న ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల రద్దుచేసిన సంగతి తెలిసిందే.

ఏచూరి, రాజాల అడ్డగింత..
కశ్మీర్‌లో పర్యటించేందుకు వచ్చిన సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాలను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీనగర్‌ విమానాశ్రయంలో దిగిన వీరిద్దరినీ అధికారులు తిరిగి ఢిల్లీకి విమానంలో పంపించారు. ఈ విషయమై సీతారాం ఏచూరి మాట్లాడుతూ..‘శ్రీనగర్‌లోకి ఎవ్వరినీ అనుమతించరాదని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను పోలీసులు మాకు చూపించారు. భద్రతా కారణాల రీత్యా ఎవ్వరినీ అక్కడకు తీసుకెళ్లలేమని చెప్పారు. ఎన్‌ఎస్‌ఏ అజిత్‌ దోవల్‌ శుక్రవారం కూడా  శ్రీనగర్‌లోని సున్నితమైన ప్రాంతాల్లో తన సహాయకులతో కలిసి పర్యటించారు. పలుచోట్ల కశ్మీరీలతో ముచ్చటించారు. అనంతరం సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్‌ పోలీసులతో ఆయన సమావేశమయ్యారు.

సంయమనం పాటించండి: గ్యుటెరస్‌
జమ్మూకశ్మీర్‌ విషయంలో భారత్‌–పాకిస్తాన్‌లు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్‌ కోరారు. ఐరాస మార్గదర్శకాలకు లోబడి సిమ్లా ఒప్పందం మేరకు ఇరుదేశాలు తమ సమస్యల్ని పరిష్కరించుకోవాలని సూచించారు. కశ్మీర్‌ సమస్యను మరో పక్షం జోక్యంలేకుండా ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని 1972లో భారత ప్రధాని ఇందిర, పాక్‌ అధ్యక్షుడు జుల్ఫీకర్‌ అలీ భుట్టో ఒప్పందంపై సంతకాలు చేశారు.

మా పాలసీ మారలేదు: అమెరికా
కశ్మీర్‌ విషయంలో తమ విధానంలో ఎలాంటి మార్పులేదని అమెరికా తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికి భారత్‌–పాకిస్తాన్‌లు ప్రత్యక్ష చర్చలు ప్రారంభించడమే మార్గమని పునరుద్ఘాటించింది. కాగా, అమెరికా విదేశాంగ సహాయ మంత్రి జాన్‌  ఆగస్టు 11–17 మధ్య భూటాన్, భారత్‌లో పర్యటించనున్నారు. భారత్, పాకిస్తాన్‌లు తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా శుక్రవారం పిలుపునిచ్చింది.

పాక్‌ భయపడుతోంది: విదేశాంగ శాఖ
కశ్మీర్‌లో భారత చర్యలు చూసి పాక్‌ భయపడుతోందనీ, ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే ఇకపై ప్రజలను తప్పుదోవ పట్టించలేమని పాక్‌ ఆందో ళన చెందుతోందని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్‌ అన్నారు. కుల్‌భూషణ్‌ జాధవ్‌ ను భారత రాయబారులు కలిసే అంశంపై తాము పాక్‌తో మాట్లాడుతున్నామన్నారు. మరోవైపు, జమ్మూ కశ్మీర్‌లోని అన్ని పంచాయతీలు, వార్డులు, మొహల్లాల్లోనూ స్వాతంత్య్ర దినోత్సవాలను నిర్వహిస్తామని బీజేపీ ప్రకటించింది.

ఆగ్రా జైలుకు కశ్మీర్‌ వేర్పాటువాదులు
కశ్మీర్‌లోని హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు మియన్‌ ఖయ్యూంను పోలీసులు కశ్మీర్‌ లోయలోని జైలు నుంచి యూపీలోని ఆగ్రాకు తరలించారు. కశ్మీర్‌లో సమస్యలు సృష్టించగల వ్యక్తులను కేంద్రం ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది. ఖయ్యూంతోపాటు 25 మంది వేర్పాటువాదులనుఆగ్రాకు  తరలించగా, శుక్రవారం మరో 20 మందిని కశ్మీర్‌ నుంచి ఆగ్రా సెంట్రల్‌ జైలుకు తీసుకొచ్చారు. ముందు జాగ్రత్త చర్యగా వారిని పోలీసులు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రముఖ న్యాయవాదిగా పేరున్న ఖయ్యూం, వేర్పాటువాదులకు సంబంధించిన అనేక కేసులను వాదించారు.
 

మరిన్ని వార్తలు