మహమ్మారిపై మలి విజయం!

6 Mar, 2019 02:42 IST|Sakshi
డాక్టర్‌ రవీంద్ర గుప్తా

ఒక వ్యక్తికి హెచ్‌ఐవీ నయం

తొలిసారి తిమోతీ బ్రౌన్‌ అనే వ్యక్తికి పూర్తిగా నయం 

12 ఏళ్ల తర్వాత మరో రోగిలో పూర్తిగా మాయమైన వైరస్‌ 

మూల కణాల మార్పిడి ద్వారా సాధ్యం.. 

భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త ఘనత 

భవిష్యత్తులో సమర్థమైన చికిత్స అందిస్తామని వెల్లడి 

లండన్‌: 3.7 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారి సంఖ్య ఇది. వీరందరికీ కచ్చితంగా ఇది శుభవార్తే. బతికున్నన్నాళ్లు వ్యాధిని భరిస్తూ.. మందులు వాడుతూ ఉండాల్సిన అవసరం లేదని భారతీయ సంతతి శాస్త్రవేత్త డాక్టర్‌ రవీంద్ర గుప్తా నిరూపించారు. లండన్‌కు చెందిన ఓ వ్యక్తి హెచ్‌ఐవీ నుంచి బయటపడినట్లు.. పూర్తిస్థాయి చికిత్స సాధ్యమైనట్లు చెబుతున్నారు. అయితే 1980ల్లో గుర్తించిన ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి మనిషి బయటపడటం ఇది రెండోసారి మాత్రమే. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించిన తర్వాతే శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పగలమని ఆయన అంటున్నారు. అమెరికాకు చెందిన తిమోతీ బ్రౌన్‌ అనే వ్యక్తి 12 ఏళ్ల కింద ఎయిడ్స్‌ను జయించి రికార్డు సృష్టించగా.. లండన్‌ రోగి రెండో వ్యక్తి అని సియాటెల్‌లో జరిగిన ఓ అంతర్జాతీయ సదస్సులో రవీంద్ర ప్రకటించారు. ఎయిడ్స్‌ వైరస్‌కు సహజమైన నిరోధకత కలిగిన వ్యక్తి తాలూకూ ఎముక మజ్జ నుంచి సేకరించిన మూలకణాలను చొప్పించడం ద్వారా ఇద్దరికీ చికిత్స జరిగింది. 

అప్పటి నుంచి ఇప్పటివరకు
పన్నెండేళ్ల కింద బెర్లిన్‌ పేషెంట్‌గా ప్రపంచానికి పరిచయమైన తిమోతీ బ్రౌన్‌ జర్మనీలో చికిత్స తీసుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటివరకు యాంట్రీ రెట్రోవైరల్‌ మందులు వాడకున్నా అతడి శరీరంలో వైరస్‌ ఛాయలేవీ లేవు. లండన్‌ రోగి విషయానికొస్తే.. ఈయనకు 2003లో వ్యాధి సోకింది. 2012లో హడ్కిన్స్‌ లింఫోమా (ఒక రకమైన రక్త కేన్సర్‌) బారిన కూడా పడ్డాడు. రవీంద్ర గుప్తా అప్పట్లో యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ లండన్‌లో పనిచేస్తుండేవారు. 2016లో తీవ్ర అనారోగ్య పరిస్థితుల మధ్య లండన్‌ పేషెంట్‌ తన వద్దకొచ్చాడని.. చివరి ప్రయత్నంగా మూలకణ చికిత్సకు ఏర్పాట్లు చేశామని రవీంద్ర తెలిపారు.

జన్యుక్రమంలో సీసీఆర్‌ 5, డెల్టా 32 అనే రెండు మార్పుల కారణంగా హెచ్‌ఐవీ వైరస్‌ సోకని ఓ వ్యక్తి మూలకణాలను లండన్‌ పేషెంట్‌కు ఎక్కించారు. కొంతకాలం పాటు కొత్త మూలకణాలను రోగి శరీరం నిరోధించిందని.. ఆ తర్వాత పరిస్థితిలో మార్పులు మొదలయ్యాయి. మూడేళ్లపాటు మూలకణాలను ఎక్కించాక గత 18 నెలలుగా లండన్‌ పేషెంట్‌ యాంటీ రెట్రోవైరల్‌ మందులు తీసుకోవడం ఆపేసినా శరీరంలో వైరస్‌ ఛాయల్లేవని రవీంద్ర వివరిస్తున్నారు. 

సులువేం కాదు.. 
మూలకణాల ద్వారా హెచ్‌ఐవీకి చికిత్స కల్పించడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. ఉత్తర యూరప్‌ ప్రాంతంలో అతికొద్ది మందిలో మాత్రమే సీసీఆర్‌ 5 జన్యుమార్పు ఉండటం దీనికి కారణం. రోగి, దాతల మూలకణాలు కచ్చితంగా సరిపోయినప్పుడే చికిత్స చేయగలరు. దాత మూలకణాలను అడ్డుకునేందుకు రోగి శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ చేసే ప్రయత్నాలను తట్టుకుని నిలవగలగడం కష్టసాధ్యమైన పని. రోగి, దాత మూలకణాల పోటీ కాస్తా వైరస్‌ తొలగిపోయేందుకు కారణమవుతుందని రవీంద్ర అంచనా వేస్తున్నారు. దీని ఆధారంగా హెచ్‌ఐవీకి సమర్థమైన చికిత్స అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అంటున్నారు.  

మరిన్ని వార్తలు