రెండో ప్రపంచ యుద్ధ సమావేశాల్లోనూ ఆమె..!!

2 Jul, 2019 12:42 IST|Sakshi

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, సలహాదారు ఇవాంక ట్రంప్‌పై సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అన్‌వాంటెడ్‌ ఇవాంక హ్యాష్‌ట్యాగ్‌(#UnwantedIvanka) తో ఆమెను ట్రోల్‌ చేస్తున్నారు. జపాన్‌లోని ఒసాకాలో జరిగిన జీ 20 సదస్సులో ఆమెకు ఎదురైన అనుభవమే ఇందుకు కారణం. అధ్యక్షుడి సలహాదారు హోదాలో ఇవాంక ఎల్లప్పుడు తండ్రి ట్రంప్‌ వెంటే ఉంటారన్న సంగతి తెలిసిందే. ఆమెతో పాటు భర్త జారేడ్‌ కుష్నేర్‌ కూడా వైట్‌హౌజ్‌లో దర్శనమివ్వడమే కాకుండా ముఖ్యమైన విదేశీ పర్యటనలోనూ ఆయన వెన్నంటే ఉంటారు.

ఈ నేపథ్యంలో ట్రంప్‌ తన పరివారానికే అన్ని పదవులు కట్టబెట్టారంటూ ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తిన విషయం విదితమే. ఈ క్రమంలో తాజాగా జీ20 సదస్సుతో పాటు ట్రంప్‌ ఉత్తర కొరియా పర్యటనలోనూ ఇవాంక పాల్గొనడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచస్థాయి నేతలతో ట్రంప్‌ భేటీ అయిన సందర్భాల్లో కూడా ఇవాంక ఆయన పక్కనే ఉండటం, ఉత్తర కొరియా నిస్సైనిక ప్రాంతంలో ట్రంప్‌తో పాటు ఆమె పర్యటించడం పట్ల విమర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కాగా ఇటీవల ఒసాకాలో జరిగిన జీ20 సదస్సులో ఇవాంక కూడా పాల్గొన్నారు. బ్రిటన్‌ ప్రధాని థెరిసా మే, అంతర్జాతీయ ద్రవ్యనిధి చీఫ్‌ క్రిస్టిన్‌ లగార్డే, ఫ్రాన్స్‌ ప్రధాని ఇమాన్యుయెల్‌ మాక్రాన్‌, కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో వివిధ అంశాలపై చర్చిస్తున్న సమయంలో ఇవాంక కూడా అక్కడే ఉన్నారు. అయితే వారి చర్చలో పాలుపంచుకోవడానికి ఇవాంక ఎంతగానో ప్రయత్నించినప్పటికీ ఆమెను ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్లు ఆమెపై జోకులు పేలుస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధంనాటి సమావేశంలో ఇవాంక పాల్గొన్నట్లుగా..ఒబామా హయాంలో వైట్‌హౌజ్‌లో ఉన్నట్లుగా.. ఇలా రకరకాల మీమ్స్‌ సృష్టించి వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా ట్రంప్‌ కుటుంబంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టే డెమొక్రటిక్‌ కాంగ్రెస్‌ మహిళ అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌...‘ ఇది నిజంగా షాకింగ్‌గా ఉంది. అయితే ఒకరి కూతురు అవడమే పదవి సంపాదించడానికి అర్హత కాదు’ అంటూ విమర్శలు గుప్పించారు. 

మరిన్ని వార్తలు