కన్నీరుమున్నీరవుతున్న హిజ్రాలు

27 Jul, 2017 10:31 IST|Sakshi
కన్నీరుమున్నీరవుతున్న హిజ్రాలు

న్యూయార్క్‌: అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేక నినాదాలతో అమెరికా వినువీధులు గర్జించాయి. దేశ మిలటరీ రంగంలో పని చేయడానికి హిజ్రాలు పనికిరారని, వారి ఆరోగ్యంపై మిలటరీ చేస్తున్న ఖర్చు తలకు మించిన భారంగా మారిందంటూ వారిపై బుధవారం ట్రంప్‌ నిషేధం విధించారు. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ట్రంప్‌ నిర్ణయంపై ప్రతిఘటన మొదలైంది.

న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద ఉన్న ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ సెంటర్‌ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న హిజ్రాలు కన్నీరు కారుస్తూ 'ఈ ప్రెసిడెంట్ మాకొద్దూ అంటూ నినదించారు'. ఏం తప్పు చేస్తే మాపై నిషేధం విధించారంటూ ప్రశ్నించారు. అధ్యక్షుడి నిర్ణయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమాన్ని లేవదీస్తామని పేర్కొన్నారు.

మరికొందరు వైట్‌ హౌస్‌ వీధిలో మార్చ్‌ నిర్వహించారు. మార్చ్‌ సందర్భంగా.. ' మేం ఇక్కడికి వచ్చాం. మేమంతా ఒక్కటే. మా అందరికీ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ అంటే అసహ్యం' అంటూ నినాదాలు చేశారు. 'మా శరీరాల్లో భాగాల గురించి మీ అందరికీ ఎందుకు.. మేం పోరాడటానికి సిద్ధం' అనే ప్లకార్డు సగటు అమెరికన్‌ హిజ్రా భావోద్వేగాన్ని, మిలటరీలో పని చేయాలనే వారి తాపత్రయాన్ని తెలుపుతోంది.

ట్రంప్‌ ఏమన్నారు
మిలటరీలోని జనరల్స్‌, నిపుణులను సంప్రదించిన అనంతరమే తాను హిజ్రాలపై నిషేధాన్ని విధించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ట్రంప్‌ చెప్పారు. మిలటరీ విజయాలపై దృష్టి సారించాలంటే హిజ్రా సైనికుల ఆరోగ్య ఖర్చుల భారాన్ని తగ్గించుకోక తప్పదని పేర్కొన్నారు.





మరిన్ని వార్తలు