ఎగిరేకారు వచ్చేస్తోంది..!

5 Aug, 2019 20:13 IST|Sakshi

టోక్యో : ఎగిరే విమానకారును 2030 సంవత్సరం నాటిని తీసుకొస్తామని జపాన్‌ దిగ్గజ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ఎన్‌ఈసీ ప్రకటించింది. తాజాగా డ్రోన్‌ ఆకారంలో ఉన్న విమానాన్ని టోక్యోలో పరీక్షించింది. నాలుగు ప్రొపెల్లర్లు, మూడు చక్రాలు గల ఈ విమానకారును రిమోట్‌ సహాయంతో భూమి నుంచి పది అడుగుల ఎత్తు వరకు ఎగిరించి గాలిలో నిమిషం పాటు నిలిపి కిందికి దించారు. ఈ ప్రయోగాన్ని అత్యంత పకడ్బందీగా పెద్ద లోహపు పంజరంలో నిర్వహించారు. దేశంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ఫ్లయింగ్ కార్లను అభివృద్ధి చేయాలని జపాన్ ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి అనుగుణంగానే ఎన్‌ఈసీ కంపెనీ విమానకారు తయారీలో నిమగ్నమైంది. తాజాగా చేపట్టిన ట్రయల్‌రన్‌ విజయవంతమైందని కంపెనీ ప్రకటించింది.

జపాన్‌ ఈశాన్య ప్రాంతమైన ఫుకుషిమాలో 2011లో వచ్చిన సునామీ, అణు విపత్తుల నుంచి ఇంకా తేరుకోని జపాన్‌ త్వరితగతిన ప్రజలను సురక్షిత స్థావరాలకు చేర్చడానికి ఎగిరే కార్లపై దృష్టి సారించిందని అనాడే వార్తలు వెలువడ్డాయి. అలాగే జపాన్‌లోని అనేక చిన్న ద్వీపాలను అనుసంధానించడానికి వీటిని ఉపయోగించాలని భావిస్తోంది. కాగా ఎన్‌ఈసీ కంపెనీ ఎగురుతున్న కారును 2017లోనే పరీక్షించగా నేలపై కూలిపోయి విఫలమైంది. ఇప్పుడు విజయవంతం అవడంతో త్వరగా వీటిని తయారుచేయాలని నిశ్చయించుకుంది. అమెరికాలో సైతం ఉబెర్‌ కంపెనీ ఎగిరేకార్ల తయారీలో బిజీగా ఉంది. విమానకార్లకు అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉండటంతో ఎలాగైనా ఈ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలని రెండు కంపెనీలు ఇప్పటినుంచే పోటీపడుతున్నాయి.
 

మరిన్ని వార్తలు