-

బ్రెజిల్‌ అధ్యక్షుడికి అమెజాన్‌ సెగలు

27 Aug, 2019 04:23 IST|Sakshi

పోర్టో వెల్హో(బ్రెజిల్‌): అమెజాన్‌ అడవుల్లో రేగిన కార్చిచ్చు సెగలు బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బోల్సోనారోకి తగులుకుంటున్నాయి. అడవులు తగలబడిపోతుంటే ఆయన స్పందించిన విధానంపై స్వదేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చులు సర్వసాధారణమే అయినప్పటికీ గతంతో పోల్చి చూస్తే ఈ ఏడాది 85 శాతం పెరిగిపోయాయి. అయితే ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీయడానికి సామాజిక సంస్థలే అడవుల్ని తగలబెట్టి ఉంటాయని బోల్సోనారో చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి.

బ్రెజిల్‌ వ్యాప్తంగానూ, ప్రపంచ దేశాల్లో బ్రెజిల్‌ దౌత్యకార్యాలయాల ఎదుట వందలాది మంది నిరసన ప్రదర్శనలకు దిగారు. సొంత దేశంలోనే కొందరు యువకులు ‘‘బోల్సోనారో మా భవిష్యత్‌ని మసి చేస్తున్నారు‘‘అంటూ ప్ల కార్డులు ప్రదర్శించారు. పోప్‌ ప్రాన్సిస్‌ కూడా తన నిరసన గళాన్ని వినిపించారు. ఊపిరితిత్తుల్లాంటి అడవులు మన భూమికి అత్యంత ముఖ్యమంటూ ప్రకటన జారీ చేశారు. ప్రేఫర్‌అమెజాన్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఉద్యమం ప్రపంచంలోనే ట్రెండింగ్‌ అంశంగా మారింది.  

బ్రెజిల్‌తో వ్యాపార సంబంధాలు నిలిపివేస్తాం  
బ్రెజిల్‌ అధ్యక్షుడు వాణిజ్య ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన అటవీ విధానాలే కార్చిచ్చు రేపాయని, ఇవి ఇంకా కొనసాగితే బ్రెజిల్, ఇతర దక్షిణ అమెరికా దేశాలతో వ్యాపార సంబంధాలు రద్దు చేసుకుంటామని యూరోపియన్‌ నాయకులు హెచ్చరించారు. బ్రెజిల్‌ అధినేత అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలను తోసి రాజని అడవుల నరికివేత, పశువుల మేతకు చదును చేయడం, అక్రమ మైనింగ్‌ను ప్రోత్సహించడం వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని ప్రపంచ దేశాల అభిప్రాయంగా ఉంది.

గతంలో కూడా బోల్సోనారో అమెజాన్‌ వర్షారణ్యాలు బ్రెజిల్‌ ఆర్థికాభివృద్ధికి అడ్డంకిగా మారాయని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో బోల్సోనారోపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. దీంతో ఆయన దిగివచ్చారు. పర్యావరణ విధానాల్ని సవరించుకుంటామని హామీ ఇచ్చారు. మంటల్ని ఆర్పడానికి 44వేల మంది సైనికుల్ని పంపిస్తానని వెల్లడించారు. అంతేకాదు కార్చిచ్చు రేగడానికి గల కారణాలపై విచారణ జరిపి బాధ్యుల్నిశిక్షిస్తామని అధినేత చెప్పినట్టుగా ఆ దేశ న్యాయశాఖ మంత్రి, పర్యావరణ విధానాలను సమీక్షించే అధికారం ఉన్న సెర్గియో మోరో ట్విటర్‌లో వెల్లడించారు.

ఆర్పడానికి జీ7 అండ
అమెజాన్‌ అడవుల్లో కార్చిచ్చుని ఆర్పడానికి అన్నివిధాల సాయపడడానికి జీ7 దేశాలు ముందుకొచ్చాయి. 2.2 కోట్ల అమెరికా డాలర్లు సాయం చేస్తామని ఫ్రాన్స్‌ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. మంటలనార్పే విమానాలు పంపడానికి ఈ డాలర్లని వినియోగించాలని తెలిపింది. బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, అమెరికాలతో కూడిన జీ7 సదస్సు అడవుల పునరుద్ధరణ ప్రణాళిక అంశంలో కూడా బ్రెజిల్‌కు ఆర్థిక సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది.   

 
ఆగస్టు 15 నుంచి దక్షిణ అమెరికా దేశాల్లో రోజురోజుకూ విస్తరిస్తున్న కార్చిచ్చు, బ్రెజిల్, బొలివియా, పెరూ, పరాగ్వే, ఈక్వెడార్, ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనా, వాయవ్య కొలంబియా దేశాల్లో కార్చిర్చు
( ఎరుపురంగు)

మరిన్ని వార్తలు