గల్వాన్‌పై ఎందుకు చైనా కన్ను?

6 Jul, 2020 03:45 IST|Sakshi

భారత్, చైనాలకు ఇదే కీలకం

1962లోనూ గల్వాన్‌ కేంద్రంగా యుద్ధం

న్యూఢిల్లీ/బీజింగ్‌: భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం మూడు దఫాలు చర్చలు జరిగినా సమసిపోలేదు. చైనా మరో అడుగు ముందుకు వేసి తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయ తమదేనని సార్వభౌమాధికారం ప్రకటించుకొని మరింత అగ్గి రాజేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలకు గల్వాన్‌ ప్రాంతమే ఎందుకంత కీలకం? 1962 యుద్ధంలో గల్వాన్‌ లోయ ఎందుకు ప్రాధాన్యంగా మారింది? పర్వత సానువుల్లో భారత్‌ బలగాలు పటిష్టంగా ఎలా ఉన్నాయి? ఎవరి సైనిక సత్తా ఎంత? వంటివన్నీ ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

రెండు పక్షాలకీ వ్యూహాత్మక ప్రాంతం
భారత్, చైనా దేశాలకు వ్యూహాత్మకంగా గల్వాన్‌ లోయ అత్యంత కీలకం. సబ్‌ సెక్టార్‌ నార్త్‌ (ఎస్‌ఎస్‌ఎన్‌)లో గల్వాన్‌ లోయ ఉంది. వివాదాస్పద ప్రాంతమైన ఆక్సాయిచిన్‌ నుంచి భారత్‌లోని లద్దాఖ్‌ దాకా గల్వాన్‌ నది ప్రవహిస్తూ ఉంటుంది. లేహ్‌కు చెందిన అన్వేషకుడు గులామ్‌ రసూల్‌ గల్వాన్‌ పేరునే ఈ నదికి పెట్టారు.వాస్తవాధీన రేఖ వెంబడి పశ్చిమాన నదీ పరివాహక ప్రాంతాల్లో గల్వాన్‌ లోయ ప్రాంతం ఎత్తు తక్కువగా ఉంటుంది. భారత్‌ బలగాలు ఆక్సాయిచిన్‌ చేరుకోవాలంటే గల్వాన్‌ లోయ గుండా చేరుకోవడం సులభం. అంతేకాకుండా పాకిస్తాన్, చైనాలోని జిన్‌జియాంగ్, లద్దాఖ్‌ సరిహద్దులతో గల్వాన్‌ లోయ కలిసి ఉంది.

గల్వాన్‌ నది టిబెట్‌ నుంచి ప్రవహిస్తూ షివోక్‌ నదిలో కలుస్తుంది. ఈ నదికి సమీపంలో ఉత్తర లద్దాఖ్‌ను కలుపుతూ ప్రధాన రహదారి ఉంది. చైనా బలగాలు దీనిని ఆక్రమిస్తే మనకి రోడ్డు ఉండదు. అందుకే గల్వాన్‌ ప్రాంతం భారత్‌కు అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో భారత్‌ మౌలిక సదుపాయాల కల్పన, షియోక్‌ నది వీదుగా వంతెన నిర్మాణం, లేహ్, దౌలత్‌ బేగ్‌ ఓల్దీలను కలుపుతూ 255 కి.మీ. పొడవున రోడ్డు నిర్మాణం వంటివి చైనాకు కంటగింపుగా మారాయి. లద్దాఖ్‌ని కేంద్ర పాలిత ప్రాంతం చేసిన దగ్గర్నుంచి డ్రాగన్‌ దేశం సరిహద్దుల్లో విషం చిమ్ముతూనే ఉంది.

దేశం కోసం ప్రాణత్యాగానికి జవాన్లు సిద్ధం
భారత సైన్యం అత్యంత ఉత్సాహంతో ఉందనీ, గతంలో మాదిరిగానే జవాన్లు దేశం కోసం జీవితాలను త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలిస్‌ (ఐటీబీపీ)డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌.ఎస్‌.దేశ్వాల్‌ పేర్కొన్నారు. చైనాతో సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో ప్రధాని మోదీ ఇటీవల లద్దాఖ్‌లో పర్యటించడం, నిములో చేసిన ప్రసంగంతో సరిహద్దుల్లో ఉన్న సైన్యంలో ధైర్యం ఇనుమడించిందని అన్నారు.

పర్వత శ్రేణుల్లో మనకి లేరు పోటీ !
ప్రపంచంలో అత్యధిక సైనికులున్న మన బలగానికి ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే, పోరాడే శక్తి ఉంది. సైనిక బలగాల సంఖ్యలో భారత్, ఉత్తర కొరియా తర్వాత స్థానమే చైనాకు దక్కుతుంది. అయితే ఆయుధాల పరంగా చైనా అత్యంత బలంగా ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఏప్రిల్‌ నుంచి చెలరేగుతున్న ఘర్షణల్లో మన సైనికులు చైనాకు గట్టిగానే బుద్ధి చెబుతున్నారు. పర్వత శ్రేణుల్లో, పీఠభూముల్లో భారత్‌ సైనికులకు మించిన వారు లేరని స్వయంగా చైనా నిపుణులే కితాబు ఇచ్చిన సందర్భాలున్నాయి.

‘‘ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద, అత్యంత అనుభవమైన, పటిష్టమైన సైనిక బలగాలున్న దేశం అమెరికా, రష్యా, యూరప్‌ కానే కాదు. అది భారత్‌’’అని చైనాలో మోడర్న్‌ వెపనరీ మ్యాగజైన్‌ సీనియర్‌ ఎడిటర్‌ హాంగ్‌ ఘాజి ఇటీవల తాను రాసిన ఆర్టికల్‌లో ప్రశంసించారు. వాస్తవాధీన రేఖ వెంబడి మొత్తం 12 డివిజన్లలో 2 లక్షలకుపైగా మన సైనికులు రేయింబగళ్లు గస్తీ తిరుగుతున్నారు. 1970 నుంచి భారతీయ ఆర్మీ తన పరిధిని విస్తరిస్తూ పర్వతాల్లో పెద్ద ఎత్తున సైనికుల్ని మోహరిస్తోంది. భారతీయులెవరైనా సైన్యంలో చేరాలంటే పర్వతారోహణ చెయ్యడం తప్పనిసరి. ప్రపంచం లోనే అత్యంత ఎత్తైన ప్రాంతమైన సియాచిన్‌లో వందలాది శిబిరాలను భారత్‌ ఏర్పాటు చేసిందని హాంగ్‌ తన వ్యాసంలో వివరించారు.  

నాటి యుద్ధంలోనూ...
1962లో భారత్, చైనా యుద్ధం కూడా గల్వాన్‌ లోయ ప్రాంతంలోనే జరిగింది. అప్పట్లో చైనా జిన్‌జియాంగ్‌ నుంచి టిబెట్‌కు 179 కి.మీ. పొడవున రోడ్డు నిర్మించింది. ఈ రోడ్డు భారత్‌కు చెందిన ఆక్సాయిచిన్‌ ప్రాంతం గుండా వెళుతుంది. భారత్‌ అనుమతి లేకుండానే ఈ రోడ్డు నిర్మాణం చేపట్టడమే అప్పట్లో ఇరుపక్షాల మధ్య అగ్గి రాజేసింది. యుద్ధం తర్వాత కూడా చైనా ఎన్నో ప్రాంతాలను ఆక్రమించింది. ఆక్సాయిచిన్‌ తమదేనని ప్రకటించుకుంది. గల్వాన్‌ ప్రాంతంపై పట్టు సాధిస్తే భారత్‌ బలగాలు ఆక్సాయిచిన్‌ చేరే అవకాశం లేదని భావిస్తున్న చైనా పథకం ప్రకారమే దాడులకు తెగబడుతోంది.

పీఠభూముల్లోనూ, పర్వత శ్రేణుల్లో భారత్‌ సైనికులు బలంగా ఉంటే, ఆక్సాయిచిన్‌ ప్రాంతంలో చైనా బలంగా ఉంది. అత్యాధునికమైన ఆయుధాలు కూడా ఆ దేశం దగ్గర ఉండడం కలవర పెట్టే అంశం. అయితే 1962తో పోల్చి చూస్తే భారత్‌ అన్ని రకాలుగా బలమైన దేశంగా అవతరించింది. ‘‘ఆక్సాయిచిన్‌లో చైనా బలంగా ఉంది. అయితే కరోనా వైరస్‌తో చైనా అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ దౌత్యపరంగా బలహీనంగా ఉండటం మనకు లాభం చేకూరే అంశం’’ అని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ఎస్‌డీ ముని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు