విమానంలో దోపిడి.. చైనా వ్యక్తి అరెస్ట్

7 Jan, 2018 15:48 IST|Sakshi

ప్రేగ్ (చెక్ రిపబ్లిక్): చెక్ రిపబ్లిక్ లోని చైనా రాయభార కార్యాలయం తమ పౌరులను విమానాల్లో ప్రయాణించే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. బీజింగ్ నుంచి ప్రేగ్ వెళుతున్న విమానంలో ఒకేసారి చాలా మంది డబ్బులు చోరీ అయ్యాయి. బాధితుల్లో ఎక్కువ మంది ప్రయాణికులు చైనా వారే ఉన్నారు. హైనాన్ ఎయిర్ లైన్స్ విమానంలో సీటు ముందున్న పాకెట్లు, సీటు పై భాగంలో లాకర్లలో ఉన్న తమ బ్యాగుల్లో ప్రయాణికులు డబ్బు దాచుకున్నారు. అయితే విమానం ల్యాండ్ అవ్వడానికి అరగంట ముందు ఓ ప్రయాణికురాలు తన డబ్బు పోయినట్టు గుర్తించారు. దీంతో వెంటనే మిగతా వారికి చెప్పడంతో,  వారిలో మరికొందరు కూడా తమ డబ్బు కూడా చోరీకి గురైనట్టు తెలుసుకున్నారు.

ఈ తంతు జరుగుతుండగానే వివిధ దేశాల కరెన్సీ నోట్లు(దాదాపు రూ. 3 లక్షలు) పెట్టి ఉన్న ఓ పిల్లో కవర్ ను ప్రయాణికుడి సీటు కింద గుర్తించారు. అయితే ప్రేగ్ లో విమానం ల్యాండ్ అవ్వగానే ఈ ఘటనలో చైనాకు చెందిన ఓ 40 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి తిరిగి చైనా అధికారులకు అప్పగించారు. సదరు వ్యక్తితో పాటూ మరో ఇద్దరు కూడా ఉన్నట్టు, వారు బీజింగ్ నుంచి వచ్చి, బెలారస్ లోనే దిగిపోయారని తెలుస్తోంది. ఈ ఘటనపై హైనాన్ ఎయిర్ లైన్స్ స్పందించడానికి నిరాకరించింది.

విమానాల్లో దోపిడిలపై అప్రమత్తంగా ఉండాలని, పెద్ద మొత్తంలో నగదుతో ప్రయాణించొద్దని ప్రేగ్ లోని చైనా రాయభార కార్యాలయం తమ దేశీయులను హెచ్చరించింది. కాగా, ఇటీవలి కాలంలో చైనాలో ఇద్దరు, ముగ్గరు, వ్యక్తులు కలిసి ముఠాగా ఏర్పడి విమానాల్లో దోపిడిలకు పాల్పడుతున్నారు. ఒక్కొక్కరు ఒక్కో చోట కూర్చొని విమానంలో అటూ ఇటూ తిరుగుతూ ఏమరపాటూగా ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి డబ్బు దొంగిలిస్తున్నారు. కాగా, డిసెంబర్ 27న జరిగిన మరో సంఘటనలో హాంకాంగ్ నుంచి బ్రూనై వెళుతున్న విమానంలో దాదాపు రూ. లక్ష ముప్పై వేలు చోరీ చేసిన ఘటనలో వూ సాంగ్ అనే చైనా వ్యక్తికి కోర్టు 8 నెలల జైలు శిక్ష విధించింది. 

>
మరిన్ని వార్తలు