-

ఐసీస్కు సవాల్ విసిరిన గే!

11 May, 2016 19:49 IST|Sakshi
ఐసీస్కు సవాల్ విసిరిన గే!

ఇస్తాంబుల్: సిరియాలో ఇస్లామిక్ స్టేట్ కనుసన్నల్లో నడుచుకోకపోతే జరిగే పరిణామాలు తెలిసినవే. చంపడంలో కొత్త కొత్త విధానాలను పబ్లిక్గా అమలు చేస్తూ ఇస్లామిక్ స్టేట్ చేస్తున్న నరమేధం సోషల్ మీడియాలో నిత్య దర్శనమే. స్వలింగ సంపర్కుల(హోమో సెక్సువల్)ను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ఎత్తైన బిల్డింగ్ నుంచి తోసేసి చంపుతున్న విషయం తెలిసిందే. ఇవన్నీ చూస్తూ కూడా ఓ సిరియన్ 'గే' ఇస్లామిక్ స్టేట్కు సవాల్ విసిరాడు.

ఇస్తాంబుల్లో జరిగిన పోటీలో పాల్గొని 'మిస్టర్ గే సిరియా' టైటిల్ గెలుచుకున్న హుస్సేన్ సాబత్(24) తనకు ఇస్లామిక్ స్టేట్ అంటే భయం కంటే ఎక్కువగా అసహ్యం ఉందని వెల్లడించాడు. ఇస్లామిక్ స్టేట్ వారు ఎల్జీబీటీ సమాజంపై జరుపుతున్న అకృత్యాలను వ్యతిరేకిస్తూ ధైర్యంగా 'గే' పోటీల్లో పాల్గొని విజయం సాధించినట్లు తెలిపాడు. అలాగే సిరియన్ 'గే'లు అంటే ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బిల్డింగ్ల పైనుంచి తోసి చంపే శరీరాలు మాత్రమే కాదని.. తమకూ కొన్ని కలలు, ఆలోచనలు ఉంటాయని తెలియజేయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు సాబత్.

ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తన మిత్రుడు.. జకారియాను తల నరికి చంపేసి, దానికి సంబంధించిన వీడియోను అతని తల్లిదండ్రులకు పంపించారని, దాంతో అతని తల్లి పిచ్చిదైపోయింని సాబత్ వెల్లడించాడు. హెయిర్ డ్రెస్సర్గా జీవనం కొనసాగిస్తున్న సాబత్.. ఐసీస్ ను ధిక్కరించి మాల్టాలో నిర్వహించిన మిస్టర్ గే వరల్డ్ కాంపిటీషన్లో పాల్గొనాలని భావించినా వీసా రాలేదని ఓ మీడియా సంస్థతో  తెలిపాడు.
 

మరిన్ని వార్తలు