కలసి ఉంటే నష్టపోతున్నాం

30 Oct, 2017 03:28 IST|Sakshi

ఐరోపాలోని పలు దేశాల్లో సంపన్న ప్రాంతాల ధోరణి

సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌:  సాధారణంగా వెనుకబడిన, దోపిడీకి గురయ్యే ప్రాంతాల ప్రజలే తమకు ప్రత్యేక రాష్ట్రం/దేశం కావాలంటూ ఉద్యమిస్తుంటారు. ఐరోపా ఖండంలోని పలుదేశాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. బాగా అభివృద్ధిచెందిన, సంపన్న ప్రాంతాల ప్రజలే విడిపోవాలని కోరుకుంటున్నారనడానికి తాజా ఉదాహరణ కేటలోనియా. ఇలాంటి ప్రాంతాలు మరికొన్ని ఉన్నాయి. స్పెయిన్‌లో ఇటలీకి ఆనుకుని, మధ్యధరా సముద్రతీరంలో ఉన్న కేటలోనియా విస్తీర్ణం 32 వేల చదరపు కిలోమీటర్లు.

స్పెయిన్‌లో అంతర్భాగంగా ఉండి నష్టపోతున్నామన్న భావన నుంచే కేటలోనియాలో ప్రజాస్వామిక స్వాతంత్య్ర కాంక్ష పుట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే ప్రజాభిప్రాయ సేకరణ (రిఫరెండం) జరిపి, స్వాతంత్య్రం ప్రకటించుకుని కేటలోనియా సంచలనం సృష్టించింది. కేటలాన్‌ భాష ప్రాచుర్యంలో ఉన్న ఈ ప్రాంత జనాభా 76 లక్షలు. స్పెయిన్‌ సైనిక నియంత జనరల్‌ ఫ్రాంకో పాలనలో కేటలాన్‌ భాష వినియోగంపై  నిషేధం విధించారు. ఆ తర్వాత స్పానిష్‌ను కేటలాన్లపై రుద్దేందుకు తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి.

అయినా ప్రత్యేక భాష, సంస్కృతుల కారణంగా 20వ శతాబ్దంలో కేటలోనియాకు మళ్లీ స్వయంప్రతిపత్తి లభించింది. కేటలోనియాను స్పెయిన్‌ దోపిడీ చేస్తోందనేది స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న ప్రజల నినాదాల్లో ఒకటి. మొత్తం స్పెయిన్‌ జనాభాలో కేటలోనియా ప్రజలు 16 శాతం. ఆర్థికంగా, పారిశ్రామికంగా ఎనలేని అభివృద్ది సాధించింది. ఆటోమొబైల్స్, రసాయన, ఆహార ఉత్పత్తులు, తయారీ, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తదితర రంగాల్లో కేటలోనియా స్పెయిన్‌ కన్నా ఎంతో ముందుంది.

కేటలోనియా నుంచి పన్నుల రూపంలో స్పెయిన్‌ కేంద్ర సర్కారు భారీగా సొమ్ము సేకరిస్తోంది. అందులో స్వల్ప మొత్తాన్ని మాత్రమే స్వయంప్రతిపత్తి కలిగిన ఈ ప్రాంతంపై తిరిగి ఖర్చుచేస్తోంది. స్పెయిన్‌లో అంతర్భాగంగా ఉండి ఇలా నష్టపోయేకంటే వేరుగా ఉండి మరింత అభివృద్ధి చెందడమే మేలని కేటలాన్లు నమ్ముతున్నారు. అదీగాక, అమెరికా, ఐరోపాలోని మహానగరాలకు దీటైన బార్సిలోనా కూడా కేటలోనియాలోనే ఉంది. 1.2 లక్షల కోట్ల డాలర్ల స్పెయిన్‌ ఆర్థిక వ్యవస్థలో ఐదో వంతు వాటా కేటలోనియా నుంచే వస్తోంది. దేశంలోని పారిశ్రామిక ఉత్పత్తులు, ఎగుమతుల్లో కేటలోనియా వాటా 25 శాతం.   

మిగతా దేశాల్లోనూ!
కేటలోనియా తరహా స్వాతంత్య్ర కాంక్షతో ఉన్న ప్రాంతాలు యూరప్‌లో మరికొన్ని ఉన్నాయి. యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) ప్రధాన కార్యాలయం(బ్రసెల్స్‌) ఉన్న బెల్జియంలోని ఫ్లాండర్స్‌ ప్రాంతంలోనూ ప్రత్యేక దేశం డిమాండ్‌ వినిపిస్తోంది.  జర్మనీలోని బవేరియా రాష్ట్రం స్వతంత్ర దేశంగా మారితే పది అగ్రగామి ఈయూ దేశాలను అధిగమిస్తుందని అక్కడి(బవేరియా) ప్రభుత్వమే చెబుతోంది. బవేరియా పార్టీ నాయకత్వాన స్వాతంత్య్రం కోసం డిమాండ్‌ ఉంది.

ఇటలీలో మహానగరాలు మిలన్, వెనిస్‌లు ఉన్న లొంబార్డీ, వెనెటో ప్రాంతాలు కూడా స్వాతంత్య్రం కోసం జనాభిప్రాయసేకరణ జరపాలని తీర్మానించాయి. కమ్యూనిస్టుల పాలనలో చెకొస్లోవేకియాగా అనేక దశాబ్దాలు కొనసాగిన దేశంలోని సంపన్న ప్రాంతం కూడా చెక్‌ రిపబ్లిక్‌గా వేరుపడింది. అమెరికాలో పెద్ద, సంపన్న రాష్ట్రాలైన కేలిఫోర్నియా, టెక్సస్‌లో కూడా వేర్పాటు డిమాండ్లు ముందుకొస్తున్నాయి. బాగా వెనుకబడిన అల్పసంఖ్యాకవర్గాలు జాతి వివక్షను కారణంగా చూపి ‘వేర్పాటు’ డిమాండ్లు చేస్తాయనేది సాధారణ నమ్మకం.

మరిన్ని వార్తలు