ఆగని ఆందోళనలు

8 Jun, 2020 05:28 IST|Sakshi
వాషింగ్టన్‌లోని శ్వేతసౌధం సమీపంలో జరిగిన భారీ ప్రదర్శన

వాషింగ్టన్‌లో భారీ ర్యాలీ

వాషింగ్టన్‌/ఫిలడెల్ఫియా: ఆఫ్రికన్‌–అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మరణంపై వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు క్రమేపీ తగ్గి ప్రజలు శాంతియుత నిరసనల బాట పడుతున్నారు. వ్యవస్థలో మార్పు రావాలని కోరుకుంటున్నారు. మినియాపొలిస్‌లో పోలీసుల దమనకాండకు ఫ్లాయిడ్‌ బలి కావడంపై అమెరికాలో వారం రోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. శనివారం రాజధాని వాషింగ్టన్‌లో జరిగిన ర్యాలీలో మునుపెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ భవనం క్యాపిటోల్, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చేరుకుని నినాదాలు చేశారు. 

అధికారులు ముందు జాగ్రత్తగా అధ్యక్ష భవనం చుట్టూ కొత్తగా ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయడంతోపాటు అదనపు భద్రతా చర్యలు తీసుకున్నారు. సియాటెల్‌లో నిరసనకారులు రాళ్లు, సీసాలు విసరడంతో పోలీసులకు గాయాలయ్యాయి.  సినిమా రంగానికి ప్రసిద్ధి చెందిన హాలీవుడ్, బార్లు, రెస్టారెంట్లకు పేరుగాంచిన నాష్‌విల్లే, శాన్‌ఫ్రాన్సిస్కోలోని గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జి, న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ బ్రిడ్జి వంటి ప్రముఖ ప్రాంతాల్లో నిరసనలు జరిగాయి.   జార్జి ఫ్లాయిడ్‌ పుట్టిన ఊరుకు దగ్గరలోని రెఫోర్డ్‌ బాప్టిస్ట్‌ చర్చిలో ప్రైవేట్‌ మెమోరియల్‌ సర్వీస్‌ జరిగింది.  యూకేలోని లండన్, ఫ్రాన్సులోని మార్సెయిల్స్‌లో జరిగిన ర్యాలీల్లో కొట్లాటలు చోటుచేసుకున్నాయి. 

మరిన్ని వార్తలు