జార్జ్‌ ‘గే’ మైకేల్‌ మరిలేరు!

26 Dec, 2016 18:33 IST|Sakshi
జార్జ్‌ ‘గే’ మైకేల్‌ మరిలేరు!

1980ల్లో అత్యంత ఆదరణవున్న బ్రిటన్‌ పాప్‌ సూపర్‌ స్టార్‌ జార్జ్‌ మైకేల్‌ 53 ఏళ్ల వయసులోనే మరణించడం సంగీత ప్రపంచంలో విషాదాన్ని నింపింది. క్రిస్‌మస్‌ రోజు మధ్యాహ్నపు నిద్రలోనే గుండె ఆగి చనిపోయినట్టు ఆయన మేనేజర్‌ మైకేల్‌ లిప్‌మన్‌ తెలియజేశారు. ‘‘వివరించలేనిది కానీ అనుమానాస్పదమైన మృతి కాదు’’, అని థేమ్స్‌ వేలీ పోలీసులు ధ్రువీకరించారు.

1963లో లండన్‌లో జన్మించిన మైకేల్‌ ‘వామ్‌!’ పాప్‌ గ్రూప్‌తో ప్రయాణం ఆరంభించాడు. తర్వాత దాన్నుంచి విడిపోయి విడిగా కొనసాగాడు. ఆయన నాలుగు దశాబ్దాల కెరీర్లో 10 కోట్లకు పైగా ఆల్బమ్స్‌ అమ్ముడైనాయి. లాస్ట్‌ క్రిస్‌మస్, వేక్‌ మి అప్‌ బిఫోర్‌ యు గో–గో, కేర్‌లెస్‌ విస్పర్, లిజెన్‌ వితౌట్‌ ప్రెజ్యుడిస్, జీసస్‌ టు ఎ చైల్డ్‌ లాంటి పాటలు మైకేల్‌కు విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టాయి. మానవ హక్కుల కోసం ఉద్దేశించిన ప్రచారంలోనూ, క్షామపీడిత ఇథియోపియాకు బాసటగానూ మైకేల్‌ పాడాడు.

ఇరాక్‌ మీద దాడి విషయంలో టోనీ బ్లెయిర్, జార్జ్‌ బుష్‌ను విమర్శిస్తూ ‘షూట్‌ ద డాగ్‌’ విడుదల చేశాడు. ఆయన చివరి ఆల్బమ్‌ సింఫోనికా 2014లో విడుదలైంది. మైకేల్‌ మతి పట్ల ఎల్టన్‌ జాన్, మడోన్నా లాంటి గాయకులు సంతాపం తెలియజేశారు. ‘నా స్నేహితుడా ఫేర్‌వెల్‌! మరో గొప్ప కళాకారుడు మనల్ని వదిలివెళ్లాడు’ అని మడోన్నా ట్వీట్‌ చేసింది.

రెండు సార్లు మత్యుముఖంలోకి
2011లో నిమోనియా కారణంగా మృత్యువు అంచుల దాకా వెళ్లొచ్చాడు మైకేల్‌. చికిత్స సమయంలో ఆసుపత్రిలో కొంతకాలం అచేతంగా ఉండిపోయాడు. 2013లో మరోసారి వాహనంలోంచి పడి తలగాయం అయిన కారణంగా ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్‌ లిఫ్ట్‌ చేయాల్సివచ్చింది.

డ్రగ్స్, డ్రైవింగ్, సెక్స్‌
తప్పుడు కారణాలవల్ల ఎన్నోసార్లు పత్రికల్లో వార్తయ్యాడు మైకేల్‌. డ్రగ్స్‌ ఉన్నాయన్న కారణంగా 2006లో ఓసారి అరెస్టయ్యాడు. బాధ్యతారాహిత్య డ్రైవింగ్‌ వల్ల రెండు సార్లు కొంతకాలం డ్రైవింగ్‌ చేయకుండా నిషేధాన్ని ఎదుర్కొన్నాడు. 1998లో కాలిఫోర్నియాలో టాయ్‌లెట్లో శృంగారం కారణంగా అమెరికా పోలీసులు అరెస్ట్‌ చేశారు. విడుదలయ్యాక, స్టింగ్‌ ఆపరేషన్‌ ద్వారా తనను పట్టుకున్న పోలీసుల మీద వ్యంగ్యంగా ‘ఔట్‌సైడ్‌’ సింగిల్‌ తెచ్చాడు.

యువకుడిగా తనను తాను బైసెక్సువల్‌గా చెప్పుకున్న మైకేల్‌ క్రమంగా తనను తాను ‘గే’గా గుర్తించాడు. అది తల్లి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందేమోనన్న భయంతో ఆ విషయాన్ని దాచిపెట్టాడు. ఆ కారణంగా తీవ్రమైన మనోవేదన అనుభవించాడు. క్రమంగా తన లైంగిక స్థితిని గౌరవంగా అంగీకరించడం మొదలుపెట్టాడు. ‘గే’గా ఉండటం విషయంలో నాకు నైతిక సమస్య ఏమీ లేదు, అని 2007లో ఓ ఇంటర్వూ్యలో చెప్పాడు.

మరిన్ని వార్తలు