బోరు కొట్టి 106 మందిని చంపేశాడు

11 Nov, 2017 01:52 IST|Sakshi

1999–2005 మధ్య జర్మనీలో ఓ మేల్‌ నర్సు ఘాతుకం  

బెర్లిన్‌: జర్మనీలో మేల్‌ నర్సుగా పనిచేసే ఓ మృగాడు తనకు బోరు కొట్టడంతో రోగులకు విషపూరిత ఇంజెక్షన్లు, మందులు ఇచ్చి 106 మందిని చంపేశాడు. పోలీసులు మరిన్ని శవాలను పరిశీలిస్తున్నందున ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 1999 నుంచి 2005 మధ్య కాలంలో అతను రెండు వైద్యశాలల్లో ఈ దుష్కార్యానికి ఒడిగట్టాడు. నీల్స్‌ హొయెగెల్‌ (41) అనే వ్యక్తి బ్రెమెన్‌ పట్టణంలోని ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేవాడు. రోజూ ఒకేలా పనిచేసి విసిగిపోయిన అతను... గుండె, రక్త ప్రసరణ వ్యవస్థలు విఫలమయ్యేలా రోగులకు విషపూరిత ఇంజెక్షన్లు ఇచ్చి ఆరోగ్యం మరింత దిగజారేలా చేసేవాడు. ఆ తర్వాత కాపాడటానికి ప్రయత్నించి ఒకవేళ రోగి బతికితే ఆ ఘనత తనదేనని చెప్పుకోవడం అతనికి అలవాటుగా మారింది. ఇలా ఎంతోమందిని నీల్స్‌ పొట్టనబెట్టుకున్నాడు. 2005లో ఓసారి రోగికి విషపూరిత మందులను ఇస్తుండగా, మరో నర్సు చూసి విషయాన్ని బయటపెట్టింది.

పోలీసులు అతణ్ని అరెస్టు చేసి విచారించగా ఇలా ఎంతో మందికి విషపు ఇంజెక్షన్లు ఇచ్చాడని తేలడంతో హత్యాయత్నం నేరం కింద 2008లో అతనికి ఏడున్నరేళ్ల జైలు శిక్ష పడింది. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ఓ మహిళ, తన తల్లికి కూడా నీల్స్‌ విషపు ఇంజెక్షన్లు ఇచ్చి చంపేసి ఉంటాడని ఫిర్యాదు చేయడంతో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి పరీక్షలు చేయగా అదే నిజమని తేలింది. దీంతో అతని చేతుల్లో చనిపోయిన మరింత మంది మృతదేహాలను కూడా వెలికితీసి పరీక్షలు చేశారు. ప్రస్తుతం ఆ లెక్క 106గా ఉండగా మరింత పెరిగే అవకాశం ఉంది. కొంతమంది రోగుల శవాలను పూడ్చకుండా, కాల్చినందువల్ల నీల్స్‌ కారణంగా చనిపోయిన వారెందరనేది ఎప్పటికీ తెలిసే అవకాశం లేదని పోలీసులు చెబుతున్నారు. నీల్స్‌పై కొత్త అభియోగాలు కూడా మోపుతామన్నారు. జర్మనీ చరిత్రలో ఇలా వరస హత్యలు చేసిన ఇంతటి క్రూరుడు ఇంకొకరు లేరని పోలీసులు అంటున్నారు.

మరిన్ని వార్తలు