గాంధీ విగ్రహం తీసేస్తారట!

7 Oct, 2016 13:03 IST|Sakshi
గాంధీ విగ్రహం తీసేస్తారట!

ఘనా దేశ రాజధాని అక్రాలోని ఒక యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని తీసేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ఇది జాతి దురహంకారమే అవుతుందని విమర్శకులు మండిపడుతున్నా, ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. యూనివర్సిటీ ఆఫ్ ఘనాలోని కొందరు ప్రొఫెసర్లు.. ఆ విగ్రహాన్ని తీసేయాలంటూ గత నెలలో పిటిషన్ల ఉద్యమం మొదలుపెట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ సంవత్సరం జూన్ నెలలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం భద్రత కోసం దాన్ని యూనివర్సిటీ ప్రాంగణం నుంచి వేరే చోటుకు తరలించాలని భావిస్తున్నట్లు ఘనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

అయితే విగ్రహాన్ని తీసేస్తారా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు కచ్చితమైన నిర్ణయం ఏమీ తీసుకోలేదని పిటిషన్ ఉద్యమానికి నేతృత్వం వహించిన ఆబాదెల్ కాంబోన్ చెప్పారు. ఘనాలోనే మరేదైనా ప్రాంతానికి విగ్రహాన్ని తరలిస్తే చాలదని, దాన్ని భారతదేశానికి తిప్పి పంపేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఘనాలో ఎక్కడైనా ఈ విగ్రహానికి ఆదరణ ఉంటుందని తాను అనుకోవట్లేదని తెలిపారు. గాంధీకి బదులు స్థానిక నాయకులైన యా అసంటెవా లేదా ఘనా తొలి అధ్యక్షుడు క్వామే ఎన్‌క్రుమా లాంటి వాళ్ల విగ్రహాలు పెట్టాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తలు