కోవిడ్‌పై కొత్త ఆయుధం!

10 Jul, 2020 04:09 IST|Sakshi

కరోనా చికిత్సకు కొత్తరకం రెమ్‌డెసివిర్‌

వాషింగ్టన్‌:  కోవిడ్‌ చికిత్సకు వాడుతున్న రెమిడెస్‌విర్‌ మందు రూపురేఖలు మార్చేందుకు అమెరికన్‌ కంపెనీ గిలియాడ్‌ ప్రయత్నాలు మొదలుపెట్టింది. నాడుల్లోకి నేరుగా ఎక్కించడం కాకుండా నెబ్యులైజర్‌ సాయంతో ఊపిరి ద్వారా శరీరాలోకి ప్రవేశించేలా చేసేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. తద్వారా రెమిడెస్‌విర్‌ను ఆసుపత్రుల్లోనే అందించాల్సిన అవసరం తప్పిపోతుంది. కోవిడ్‌–19 చికిత్సకు ప్రస్తుతానికి ఏ మందు అందుబాటులో లేని నేపథ్యంలో ఎబోలా వైరస్‌ చికిత్సకు ఉపయోగించిన రెమిడెస్‌విర్, జలుబు కోసం తయారైన ఫావిపిరవిర్‌లను ప్రయోగాత్మకంగా వాడుతున్న విషయం తెలిసిందే.

తీవ్రస్థాయి లక్షణాలు ఉన్న వారికి మాత్రమే అత్యవసర పరిస్థితుల్లో రెమిడెస్‌విర్‌ను ఇవ్వాలన్నది ప్రస్తుతం అనుసరిస్తున్న పద్ధతి. ఆస్తమా లక్షణాలను మందగింప జేసేందుకు వాడే నెబ్యులైజర్‌ ద్వారా రెమిడెస్‌విర్‌ను అందించగలిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పద్ధతిలో ఇచ్చే మందు సక్రమంగా పనిచేస్తుందా? ఆశించిన ఫలితాలు ఇస్తుందా? లేదా? అన్నది పరిశీలిచేందుకు గిలియాడ్‌ తొలిదశ ప్రయోగాలు మొదలుపెట్టింది. సుమారు 60 మంది రోగులకు కొత్త పద్ధతిలో మందు అందించి పరిశీలించనున్నారు. ఆసుపత్రిలో చేరాల్సినంత స్థాయిలో అనారోగ్యం లేనివారిపై జరిగే ఈ ప్రయోగాలు విజయవంతమైతే ఇన్ఫెక్షన్‌ సోకిన ప్రాంతానికే నేరుగా మందు వెళుతుందని తద్వారా మెరుగైన ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్నట్లు గిలియాడ్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మెర్‌దాడ్‌ పార్సే తెలిపారు. 

మరిన్ని వార్తలు