బాయ్ ఫ్రెండ్ ను పెళ్లాడిన ఐదేళ్ల చిన్నారి

22 Jun, 2017 16:32 IST|Sakshiస్కాట్లాండ్: వ్యాధులతో సతమతమవుతూ కొన్ని రోజులు మాత్రమే బతుకుతారని తెలిసిన వారికి చివరి కోరికను తీర్చడం తరచుగా వింటుంటాం. అలాగే స్కాట్లాండ్ కి చెందిన ఐదేళ్ల చిన్నారి చివరి కోరిక ఏంటని ప్రశ్నించగా పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. కొందరు బంధువుల సమక్షంలో చిన్నారికి ఆమె కోరిన బాలుడితో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.

ఆ వివరాలివి.. స్కాట్లాండ్ కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఇలీధ్ పాటర్సన్. కొంతకాలంగా భయంకరమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతోంది. ఎక్కువ రోజులు బతకదని డాక్టర్లు తేల్చేశారు. చిన్నారి కోరికలను తీర్చి బతికున్నంతకాలం పాపను సంతోషంగా ఉండేలా చూడాలని ఆమె తల్లిదండ్రులకు సూచించారు. అందరు పిల్లల్లాగే తన కూతురు బొమ్మలు, చాక్లెట్లు, ఇతర ఆట వస్తువులు లాంటివి అడుగుతుందని ఇలీధ్ పాటర్సన్ పేరెంట్స్ భావించారు.  అయితే ఎవరూ ఊహించని విధంగా తనకు తన కోరికల చిట్టాలో పెళ్లిని మొదటి కోరికగా వెల్లడించింది. దీంతో షాకవ్వడం ఇలీధ్ పేరెంట్స్ వంతయింది.

తన బెస్ట్ ఫ్రెండ్ హ్యారిసన్ గ్రేర్ తో పెళ్లి చేయాలని కోరింది. ఈ విషయాన్ని హ్యారిసన్ తండ్రి బిల్లికి తెలపగా పాప సంతోషం కంటే తమకు ఏదీ ఎక్కువకాదని చెప్పారు. చిన్నారిని పెళ్లి కూతురిగా ముస్తాబు చేసి బంధువులు, సన్నిహితుల సమక్షంలో హ్యారిసన్ తో వివాహం జరిపించారు. తమ పాపకు హ్యారిసన్ ఇంటే ఇష్టమని, అయితే ఈ స్థాయిలో ప్రేమ ఉందని తెలియదని ఇలీధ్ తల్లిదండ్రులు చెప్పారు. ఇలీద్ పరిస్థితి చెప్పి హ్యారిసన్ ను పెళ్లికి ఒప్పించినట్లు అతడి తండ్రి బిల్లీ వివరించారు.

మరిన్ని వార్తలు