ఈ చిట్టి తల్లి.. ఓ తల్లి!

5 May, 2016 10:46 IST|Sakshi
ఈ చిట్టి తల్లి.. ఓ తల్లి!

బుకారెస్ట్: ఇక్కడ కనిపిస్తున్న ఫొటో చూసి.. ఆ పాలబుగ్గల చిన్నారిని ఎత్తుకుని ఆడిస్తున్నది.. ఆమె అక్క అనుకుంటే మీరు పొరబడినట్లే. ఎందుకంటే ఆ బాలికే (15) ఆ చిన్నారికి కన్నతల్లి. నిజమే, ఈ ఒక్క ఇంట్లోనే కాదు రొమేనియాలో ఎన్నో కుటుంబాల్లో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయి. గట్టిగా టీనేజి కూడా రాకముందే కొంతమంది అమ్మాయిలు తల్లులవుతున్నారు. బాల్యవివాహాలకు తోడు ఆరోగ్యం గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం కూడా ఇందుకు కారణమవుతోంది. ఈ విషయంపై ఐక్యరాజ్యసమితి కూడా విచారం వ్యక్తం చేస్తోంది. యూరోపియన్ యూనియన్ జనాభా లెక్కల ప్రకారం 2013 ఏడాదిలో 15.6 శాతం చిన్నారులకు టీనేజీ యువతులే జన్మనిచ్చారట. రెండో స్థానంలో ఉన్న బల్గేరియాలో 14.7 శాతం చిన్నారులు చిట్టి తల్లులకు పుడుతున్నారు.

గర్భం దాల్చకముందు ఎప్పుడూ తాము అసలు వైద్యులను చూడలేదని, కేవలం ఆ సమయంలోనే చూశామని.. గర్భం దాల్చినపుడు చాలా భయమేస్తుందని ఓ యువతి చెప్పింది. టీనేజీలో పెళ్లిచేసుకుంటే తలెత్తే ఇబ్బందులు తాను చూశానని, అందుకే తాను పెళ్లి చేసుకోనని డయానా (15) అనే మరో యువతి చెప్పింది. తనకు పిల్లలు వద్దు.. పెళ్లి వద్దు అంటూ ఆమె ఆందోళన చెందుతోంది. తన ఆలనాపాలనా కోసమే మరొకరిపై ఆధారపడే వయసులో మరో చిన్నారికి తల్లిగా మారడం చాలా దురదృష్టకరమని ఆ ఫొటోలో కనిపిస్తున్న బాలిక లోరెనా (15) అంటోంది. తోటి చిన్నారులతో ఆడుకోవాల్సిన సమయంలో తన చిన్నారికి లాలిపాటలు పాడాల్సి వస్తుందని వాపోయింది. తల్లులవుతున్న టీనేజీ వాళ్లలో 12-15 ఏళ్ల మధ్య ఉన్నవారు  2,212 మంది ఉన్నారని సర్వేలో తేలింది.

మూడింట రెండు వంతుల మంది గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారట. ఆర్థిక పరిస్థితులు బాగా లేని కుటుంబాలు తొందరపడి బాల్య వివాహాలు చేయడం, వారి భర్తలు పని నిమిత్తం వలసలు వెల్లడంతో బాలికల కష్టాలు రెట్టింపవుతున్నాయి. దాంతో ఇంట్లో వృద్ధులకు వీరే ఆయాలుగా మారాల్సి వస్తోందని, కొన్ని సందర్భాలలో భర్త ఇంట్లో ఎవరూ లేకపోతే పుట్టింటికి వచ్చి వారితో కలిసి ఉండాల్సి వస్తుందని లోరేనా మాత్రమే కాదు మరికొంత మంది చిట్టి తల్లులు తమ బాధను వెల్లడించారు.

మరిన్ని వార్తలు