చైనా: గాజు వంతెనలో 'పగుళ్ల' ఎఫెక్ట్‌!

10 Oct, 2017 19:23 IST|Sakshi

బీజింగ్‌: చైనా ఆకాశ వంతెనలకు ప్రసిద్ధి. అక్కడ ఇప్పుడు ఎక్కడా చూసినా గాజు బ్రిడ్జీలు దర్శనమిస్తున్నాయి.  ఆకాశంలో అత్యంత ఎత్తున గాజు బ్రిడ్జీలపై నడవడమంటే సాహసమే.. ఆ గాజు బ్రిడ్జీలపై నడుస్తూ కిందకు చూసేందుకు చాలామంది జడుసుకుంటున్నారు. అలా చూస్తే.. ఒళ్లు జలదరించే అనుభవం. ఆ అనుభవాన్ని చైనా పర్యాటకులు తాజాగా ఆస్వాదివిస్తున్నారు.

కానీ, ఉత్తర చైనాలోని హుబీ ప్రావిన్స్‌లో 3,800 అడుగుల ఎత్తులో ఆకాశ గాజు వంతెనను ఇటీవల ప్రారంభించారు. ఈ వంతెనపై నడిచిన సందర్శకులు దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. గాజు వంతెనపై అడుగులు వేస్తూ అల్లాడిపోయారు. భయంతో కేకలు వేసి.. గుండె చిక్కబట్టుకొని నడిచారు. అందుకు కారణం.. ఆ గాజు వంతెనపై అడుగులు వేస్తుండగా.. అమాంతం పగుళ్లు రావడం.. పగులుతున్నట్టు సౌండ్‌ వినిపించడడమే.. ఇలా పగుళ్లు కనిపించి.. ధ్వని కూడా వినిపించడంతో గాజు వంతెనపై నడిచిన వాళ్లు బెంబెలెత్తిపోయారు.

అసలు విషయం తెలిసి సందర్శకులు షాక్‌ తిన్నారు. వంతెన నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ గాజు వంతెనపై నిజంగా  పగుళ్లు రాలేదు. కానీ, సందర్శకులను భయపెట్టేందుకు అంటూ సెన్సర్లతో పగుళ్లు వచ్చేలా ఏర్పాటుచేశారు. సందర్శకులు అడుగులు వేస్తుండగా.. ఆ అడుగులకు అనుగుణంగా పగుళ్లు వస్తున్నట్టు కనిపించేలా సెన్సార్లు అమర్చారు. అందుకు అనుగుణంగా పగులుతున్న శబ్దం కూడా వచ్చేలా ఏర్పాటుచేశారు. అయితే, వంతెన చివరిలో కొద్దిదూరం మాత్రమే ఈ ఏర్పాటు చేశారు. తొలిసారి నడువాలన్న ఉత్సాహంతో గాజు వంతెనపైకి ఎక్కి.. జామ్‌ జామ్‌ అంటూ అడుగులు వేసుకుంటూ వెళ్లిన వారు.. చివర్లో పగుళ్లు రావడంతో బెంబేలెత్తిపోయారు. భయంతో బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేత పట్టుకొని అడుగులు వేశారు. ఇది సరదాకు చేశారని తెలిసి.. వంతెన నిర్వాహకులపై సందర్శకులు మండిపడుతున్నారు. గాజు వంతెనపై సందర్శకులు భయోత్పాతంతో పడిపోతున్న వీడియోలను షేర్‌ చేస్తున్న నెటిజన్లు.. ఇదేం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ పగుళ్ల గురించి ముందే తెలిసి.. వంతెన ఎక్కుతున్న సందర్శకులు.. నడిచేటప్పుడు వాటిని చూసి ఆస్వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇలా ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలు