సరిహద్దు వివాదం: భారత్‌కు పెరుగుతున్న మద్దతు!

4 Jul, 2020 14:42 IST|Sakshi

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కయ్యానికి కాలుదువ్వుతున్న చైనా హద్దులు మీరితే తగిన బుద్ధి చెప్పేందుకు భారత్‌ సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం స్పష్టమైన సంకేతాలు జారీ చేసిన విషయం విదితమే.‘బలహీనులు, పిరికివారు శాంతిని సాధించలేరు. శాంతి స్థాపనకు ముందుగా ధైర్య సాహసాలు అత్యంత ఆవశ్యకం. అవి భారత జవాన్ల వద్ద పుష్కలంగా ఉన్నాయి’అంటూ భారత ఆర్మీ శక్తిసామర్థ్యాల గురించి మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. అదే విధంగా సామ్రాజ్యవాద కాంక్ష ప్రపంచానికి ప్రమాదకరమంటూ.. విస్తరణ వాదానికి కాలం చెల్లించిందంటూ చైనాకు స్పష్టమైన సందేశమిచ్చారు. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా సహా ఫ్రాన్స్ సహా పలు దేశాలు, అంతర్జాతీయ సమాజం నుంచి భారత్‌కు మద్దతు పెరుగుతుండటం అన్ని విధాలుగా సానుకూల అంశంగా చెప్పుకోవచ్చు.(సెల్యూట్‌.. బ్రేవ్‌ హార్ట్స్‌!)

అలాంటి చర్యలకు వ్యతిరేకం
ప్రధాని మోదీ లద్ధాఖ్‌ పర్యటించిన నేపథ్యంలో భారత్‌లో జపాన్‌ రాయబారి సతోషి సుజుకి కీలక వ్యాఖ్యలు చేశారు. యథాస్థితిని మార్చే ఏకపక్ష చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ డ్రాగన్‌ను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. భారత్‌కు తమ దేశం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘చర్చల ద్వారా శాంతియుతమైన పరిష్కారాన్ని జపాన్‌ కోరుకుంటోంది. అదే సమయంలో యథాతథ స్థితిని మార్చే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది’’అంటూ భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లాతో సంభాషణ తర్వాత ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా 2017లో చైనాతో డోక్లాం వివాద సమయంలోనూ జపాన్‌.. భారత్‌కు మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే. 

భారత్‌ నిర్ణయం భేష్
భారత​- చైనా సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలు ఆ దేశాన్ని పాలిస్తున్న చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ నిజ స్వరూపాన్ని తేటతెల్లం చేస్తున్నాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చైనా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్వేతసౌధం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇక అదే విధంగా అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. భారత్‌ చైనా యాప్‌లపై నిషేధం విధించడాన్ని స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. సీసీపీ ఆధీనంలోనే ఆ యాప్‌లు పనిచేస్తాయంటూ ఘాటు విమర్శలు చేశారు. అదే విధంగా అమెరికా బలగాలను రంగంలోకి దింపేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చైనాకు హెచ్చరికలు జారీ చేశారు.(చైనా సముద్రంలోకి అమెరికా యుద్ధనౌకలు)

అవసరమైతే సాయుధ బలగాలు దింపుతాం
వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు నేపథ్యంలో ఫ్రాన్స్‌.. భారత్‌కు అండగా ఉంటామని స్పష్టం చేసింది. అవసరమైతే తమ సాయుధ బలగాలను తరలించడం సహా పాటు భారత్‌కు ఏవిధమైన సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. దక్షిణాసియా ప్రాంతంలో భారత్‌ తమ వ్యూహాత్మక భాగస్వామని.. క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో భారత్‌లో రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి సంప్రదింపులు జరిపేందుకు సిద్ధమని పేర్కొంది. జూన్‌ 15న జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు మరణించడం పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ.. ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ఫ్లోరెన్స్‌ పార్లీ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌​ సింగ్‌కు రాసిన లేఖలో ఈ మేరకు సాయం ప్రకటించారు.

నిశితంగా పరిశీలిస్తున్నాం
కరోనా వ్యాప్తి తొలినాళ్ల నుంచి చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ బుధవారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా 2020 వ్యూహాత్మక రక్షణ విధానం, 2024 ప్రణాళికను ప్రారంభించిన సందర్భంగా.. ఇటీవలి కాలంలో భారత్‌- చైనా, దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రంలో ఉద్రిక్తతలు పెరగడం గమనిస్తున్నామన్నారు. వ్యూహాత్మకంగా, రక్షణపరంగా ఎంతో కీలకమైన ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో ఘర్షణ వాతావరణం నెలకొనడానికి కారణాలను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

ఇక రక్షణ రంగంలో పదేళ్లకాలానికి 270 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ కేటాయించిన సందర్భంగా.. కేవలం వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో స్వేచ్ఛా వాణిజ్యం, పెట్టుబడులు, పరస్పర సహాయ సహకారాలు అందించుకోవడంలో భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్‌, వియత్నాం ముందుంటాయని పేర్కొన్నారు. ఆ ప్రాంతంపై ఆధిపత్యం చాటుకోవాలనుకుంటున్న చైనా తీరును పరోక్షంగా విమర్శించారు. కాగా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణంతో ఆస్ట్రేలియా.. చైనా హువావే టెక్నాలజీస్‌ లిమిటెడ్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

సరిహద్దుల్లో వివాదం ఆందోళనకరం
సరిహద్దు వివాదాన్ని భారత్‌, చైనాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకోవాలని బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతలు తదితర పరిణామాలు ఆందోళనకరమని వ్యాఖ్యానించారు. అయితే తాము ఎటువైపు ఉంటామో బోరిస్‌ స్పష్టం చేయకపోయినా.. హాంకాంగ్‌ విషయంలో మాత్రం చైనాపై బ్రిటన్‌ గుర్రుగానే ఉంది. ఈ మేరకు బుధవారం ప్రధాని మాట్లాడుతూ.. హాంకాంగ్‌ విషయంలో చైనా ఒప్పందాన్ని అతిక్రమించి, తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

>
మరిన్ని వార్తలు