రుగ్వేద కాలం నుంచే అంటురోగాలు

27 Jun, 2020 14:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్‌ మహమ్మారి ఇప్పట్లో మానవాళిని వదిలిపెట్టి పోయేలా కనిపించడం లేదు. ఇలాంటి అంటురోగాలు వందేళ్లకోసారి అన్నట్లు మానవాళిపై అనాదిగా దాడిచేస్తూ వస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు శాస్త్ర విజ్ఞానం అంతగా పరిఢవిల్లలేదు కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు అంటు రోగాలను దేవతలుగా కొలిచేవారు. ‘మమ్ము విడిచి పో పొమ్ము’ అంటూ వేడుకునే వారు. 

1897లో ‘ప్లేగ్‌’ మహమ్మారి ప్రబలినప్పుడు బెంగళూరులో ‘ప్లేగ్‌ అమ్మ’ పేరిట పలు ఆలయాలు వెలిశాయి. ప్లేగ్‌ను కన్నడ భాషలో ‘పిడుగు’, ‘కాడు’ అని పిలిచేవారు. కోయంబత్తూర్‌లో ‘ప్లేగ్‌ మరియమ్మాన్‌’ పేరిట ఆలయాలు వెలిశాయి. తమిళ భాషలో మరి అంటే వర్షం అని అర్థం. వర్షాల రాకతో అంటురోగాలు ప్రబలేవి కనుక వర్షం సూచనతో మరియమ్మార్‌ అని పేరు పెట్టి ఉంటారు. ప్లేగ్‌ను తమిళంలో ‘వాతాగళ్, కొల్లాయ్‌ నాయి’ అని కూడా వ్యవహరించేవారు. 
 

150 సంవత్సరాల క్రితం ప్లేగ్‌ వల్ల అప్పటికీ ఎప్పుడు లేనంతగ ప్రాణ నష్టం సంభవించింది. అంతకుముందు ఎక్కువ మందికి కామన్‌గా వచ్చేది ‘స్మాల్‌పాక్స్‌’. దీన్ని తెలుగులో తట్టు పోసింది, తల్లి చేసిందీ అనే వాళ్లు. రుగ్వేద కాలం నుంచి ఈ స్మాల్‌పాక్స్‌ ఉందని వ్యవసాయ శాస్త్రవేత్త వైఎల్‌ నేని తెలిపారు. రుగ్వేదంలో దీన్ని ‘శిపద’, శిమిద’గా పేర్కొన్నారట. శిమదను తీసుకొని పొమ్మంటూ నాడు ప్రజలు నదులకు పూజలు చేసేవారట. ఆప్టే సంస్కృత డిక్షనరీ ప్రకారం శిప అనే చర్మం అని అర్థం. చర్మంపై బొబ్బలు వచ్చే జబ్బునే తట్టు పోసింది అని అంటాం. 

నాడు దక్షిణాదిలో తట్టు తగ్గేందుకు ‘సితాల దేవి’ని పూజించేవారని చారిత్రక, పౌరానికి, తాంత్రిక పుస్తకాలు తెలియజేస్తున్నాయి. భావ మిశ్ర సంకలనం చేసిన ‘భావ ప్రకాష’ పుస్తకంలో ‘సితాల దేవి’ ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. అప్పట్లో భారత్‌లో అన్ని జబ్బులను ఆడ దేవతల పేరిటే వర్ణించేవారు, కొలిచేవారు. నాడు పిల్లల బాగోగులను కన్న తల్లులే చూసుకునేవారు కనుక, ఆడవాళ్లదే బాధ్యతగా భావించి ఆడ దేవతల పేర్లే పెట్టేవారేమో!

16వ శతాబ్దంలోనే ‘ది పాథాలోజీ ఆఫ్‌ సితాల’ అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ఈ అంటురోగాలు రావొద్దంటూ ‘సీతాలష్టమీ’ జరిపేవారని రఘునందన్‌ భట్టాచార్య అనే బెంగాలీ రచయిత అందులో పేర్కొన్నారు. 1690లో, 1750, 1770 మధ్య సీతాలమ్మపై పలు కవిత్వాలు కూడా వచ్చాయి. ‘సీతాలమ్మ మంగళ్‌’ పేరిట నిత్యానంద చక్రవర్తి ఏకంగా స్త్రోత్రమే రాశారు. ఇక మహమ్మారి పదం హిందీ మాట్లాడే ప్రాంతాల నుంచి వచ్చింది. నేటి కరోనాను కూడా మమమ్మారిగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. 

మరిన్ని వార్తలు