ప్రైవేటు దీవిలో తేలిన నిత్యానంద!

3 Dec, 2019 15:29 IST|Sakshi

న్యూఢిల్లీ: దొంగ పాస్‌పోర్టుతో దేశం దాటిన వివాదాస్పద స్వామిజీ నిత్యానంద ట్రినిడాడ్‌ దీవుల్లో తేలారు. అక్కడ ఓ ప్రైవేట్‌ దీవిని కొనుగోలు చేసిన నిత్యానంద.. దానికి కైలాస అని పేరు కూడా పెట్టారు. తన దీవికి దేశం హోదా ప్రకటించాలని కోరుతున్న నిత్యానంద ఆ దేశానికి ప్రత్యేక పాస్‌పోర్ట్‌కూడా రూపొందించనున్నాట్టు చెబుతున్నారు. అనేక వివాదాలతో ఇప్పటికే అనేకసార్లు పతాక శీర్షికలు ఎక్కిన నిత్యానంద.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిత్యానంద యోగిణి సర్వజ్ఞపీఠం పేరుతో ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించారంటూ జనార్ధనశర్మ అనే ఓ వ్యక్తి కేసు పెట్టాడు.

ఆశ్రమంలో పరిస్థితిని చూసిన పోలీసులు అక్కడ అక్రమంగా అమ్మాయిలను నిర్బంధించిన మాట నిజమేనని నిర్ధారణకు వచ్చారు. దీంతో నిత్యానందపై కేసు రిజిస్టర్ చేశారు. మరోవైపు నిత్యానందను తొమ్మిదేళ్లనాటి కేసు వెంటాడుతోంది. ఆశ్రమానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారం చేసాడని ఆరోపణ దాదాపు నిర్ధారణ అయింది.  గతంలో ఉన్న కేసుల్లో నిత్యానంద 40కిపైగా వాయిదాలకు కోర్టులో హాజరుకాలేదు.ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో నిత్యానంద..దొంగ పాస్‌పోర్టుతో దేశం విడిచిపారిపోయాడు. అప్పటినుండి అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు