ఏం బాబూ.. బంగారం తింటావా?

22 Nov, 2015 10:20 IST|Sakshi
ఏం బాబూ.. బంగారం తింటావా?

'లడ్డూ కావాలా నాయానా?' అంటూ షాట్స్ చాక్లెట్లతో భారతీయుల నోళ్లలో నీళ్లూరించింది క్యాడ్బరీస్ కంపెనీ. ఇంతకంటే ఘనంగా 'ఏం బాబూ.. బంగారం తింటావా?' అంటూ నెస్లే జపాన్ లిమిటెడ్ ముందుకొస్తోంది. బంగారం ధరిస్తాంకానీ, తినడమేమిటనే కదా మీ సందేహం! అయితే తప్పకుండా ఈ గోల్డ్ చాక్లెట్ 'ప్రివ్యూ' టేస్ట్ చేయాల్సిందే.

జపాన్లో 1973లో ప్రారంభమైన నెస్లే కిట్ క్యాట్ చాక్లెట్.. ఇప్పటి వరకు దాదాపు 200 రకాల ఫ్లేవర్లలో కస్టమర్లకు రుచులు పంచింది. ప్రధానంగా ప్రపంచంలోని మిగతాదేశాల కంటే జపాన్లో ఆ కంపెనీ ఉత్పత్తులకు మంచి క్రేజ్ ఉంది. స్థానికుల అభిరుచులకు అనుగుణంగా నెస్లే కూడా ఆ దేశంలో చేసినన్ని చాక్లెట్ ప్రయోగాలు మరే దేశంలోనూ చేయలేదు. ఆ అభిమానానికి కొనసాగింపుగా కేవలం జపాన్ లో మాత్రమే దొరికేలా గోల్డ్ కిట్ క్యాట్ చాక్లెట్ ను తయారు చేసింది.

పేరుకు తగ్గట్లే అత్యంత మధురమైన చాక్లెట్ ను స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారు ర్యాపర్ లో చుట్టి అమ్మకానికి ఉంచబోతోంది. ప్రాథమికంగా దీని ధర 2016 యాన్లు (మన కరెన్సీలో దాదాపు రూ. 1,500)గా నిర్ణయించారు. వచ్చే నెల నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్న గోల్డ్ కిట్ క్యాట్ పసందైన వగరు ఫ్లేవర్ లో ఉండబోతోంది. జపాన్ వాసులు తప్ప ఇతరులు కావాలనుకున్నా దొరకదు కాబట్టే ఈ చాక్లెట్ చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు