‘ద ఇంగ్లిష్‌ పేషంట్‌’కు గోల్డెన్‌ బుకర్‌

10 Jul, 2018 02:06 IST|Sakshi

పబ్లిక్‌ ఓటింగ్‌ ద్వారా అత్యుత్తమ పుస్తకంగా ఎంపిక

51 మంది బుకర్‌ ప్రైజ్‌

విజేతలను ఓడించిన ఆందాజీ

లండన్‌: శ్రీలంక మూలాలు కలిగిన కెనడా రచయిత, సాంస్కృతిక దిగ్గజం మైకేల్‌ ఆందాజీ రచన ‘ద ఇంగ్లిష్‌ పేషంట్‌’ గోల్డెన్‌ మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకుంది. ఇది గత యాభై ఏళ్లలో బుకర్‌ ప్రైజ్‌ సాధించిన పుస్తకాల్లో అత్యుత్తమమైందిగా ఎంపికైంది. బుకర్‌ ప్రైజ్‌ స్థాపించి 50 ఏళ్లు అయిన సందర్భంగా ఓటింగ్‌ నిర్వహించి దీన్ని ఎంపిక చేశారు. గతంలో మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ సాధించిన భారతీయ మూలాలు కలిగిన రచయితలు వీఎస్‌ నైపాల్‌ (ఇన్‌ ఎ ఫ్రీ స్టేట్‌–1971), సల్మాన్‌ రష్దీ (మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌–1981), అరుంధతీరాయ్‌ (ద గాడ్‌ ఆఫ్‌ స్మాల్‌ థింగ్స్‌–1997), కిరణ్‌ దేశాయ్‌ (ద ఇన్‌హెరిటెన్స్‌ ఆఫ్‌ లాస్‌–2006), అరవింద్‌ అడిగ (ద వైట్‌ టైగర్‌–2008)లతో సహా విజేతలందరినీ ఓడించి 74 ఏళ్ల ఆందాజీ ఈ ఘనత సాధించారు.

‘ద ఇంగ్లిష్‌ పేషంట్‌’ నవల బేరీ ఉన్స్‌వర్త్‌ రచన ‘సేక్రెడ్‌ హంగర్‌’తో కలిసి 1992లో బుకర్‌ ప్రైజ్‌ గెల్చుకుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రేమ, సంఘర్షణకు సంబంధించిన కథను ఆందాజీ ఆ నవలలో అత్యద్భుత వర్ణనలతో అందరినీ ఆకట్టుకునేలా రచించారు. మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ 50వ వార్షికోత్సవం సందర్భంగా గతంలో ఈ ప్రైజ్‌ సాధించిన 51 మంది విజేతలను జడ్జీల ప్యానెల్‌గా ఎంపిక చేశారు. వారు ప్రతి దశాబ్దానికీ ఓ నవలను ఎంపిక చేయగా.. ఆ ఐదు నవలల్లో ప్రజలు ఓట్ల ద్వారా ఆందాజీ యుద్ధ కాలపు ప్రేమ కథకు పట్టం కట్టారు.

ఈ సందర్భంగా లండన్‌లో జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆందాజీ  మాట్లాడుతూ జాబితాలో ఇదే అత్యుత్తమ పుస్తకమని తాను నమ్ముతున్నట్టు పేర్కొన్నారు. బుకర్‌ ప్రైజ్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ హెలెనా కెన్నెడీ ఆందాజీ రచన గురించి మాట్లాడుతూ ‘ఇది కవితాత్మక, తాత్విక అంశాలతో కూడిన సమగ్ర రచనా సృష్టి. ఇది ముమ్మాటికీ గోల్డెన్‌ మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌కు అర్హత కలిగింది’ అని అన్నారు. జడ్జి కమిలా షంసీ మాట్లాడుతూ ఇది అరుదైన నవలని, అందరినీ  భావోద్వేగానికి గురిచేస్తుందని అన్నారు. 2008లో బుకర్‌ ప్రైజ్‌ 40వ వార్షికోత్సవం సందర్భంగా ఓటింగ్‌ నిర్వహించగా ప్రజలు సల్మాన్‌ రష్దీ ‘మిడ్‌నైట్స్‌ చిల్డ్రన్‌’కు పట్టం కట్టారు. 

మరిన్ని వార్తలు