దైవభక్తితో మంచి పని వాతావరణం

23 Jun, 2014 00:29 IST|Sakshi

వాషింగ్టన్: దైవభక్తికి.. పని వాతావరణానికి సంబంధం ఉందట. దైవభక్తి ఎక్కువగా ఉంటే దాని ప్రభావం పనిచేసే తీరుపై ఉంటుందని చెపుతోంది ఒక అమెరికన్ సర్వే. అయితే సంబంధిత వ్యక్తికి దైవ చింతన ఎంత ఉందనే దానిని బట్టి దీని ప్రభావం ఉంటుందని బేలర్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్‌లోని సోషియాలజీ ప్రొఫెసర్ జెర్రీ జెడ్ పార్క్ చెప్పారు. ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో సుమారు 1,022 మంది ఫుల్‌టైమ్ ఉగ్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరిం చారు. ఉద్యోగపరమైన సంతృప్తి, చిత్తశుద్ధితో పని చేయడం, వ్యవస్థాపకత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

దైవ చింతన ప్రభావం 60 శాతం మంది అమెరికన్ల పని వాతావరణలో ప్రతిబింబిస్తోందని పార్క్ చెపుతున్నారు. దీనివల్ల పని చేసే వారికే కాకుండా.. సంస్థలకూ మేలు చేకూరుతోందని చెపుతున్నారు. తరచూ చర్చికి వెళ్లేవారిలో ఎక్కువ మంది మత విశ్వాసాన్ని, పనిని కలిపే చూస్తామని చెప్పారు. అంతేకాక తమను తాము ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా భావిస్తున్నారని తెలిపారు. అయితే అప్పుడప్పుడు చర్చికి వెళ్లేవారు మాత్రం పనిలో సంతృప్తి చెందుతున్నామనిగానీ, చిత్తశుద్ధితో పని చేస్తున్నామనిగానీ చెప్పలేదు.
 

మరిన్ని వార్తలు