వేధింపులపై గూగుల్‌ ఉక్కుపాదం

27 Oct, 2018 04:23 IST|Sakshi

రెండేళ్లలో 48 మందికి ఉద్వాసన

న్యూయార్క్‌: సహోద్యోగులపై లైంగిక వేధింపులు, లైంగిక దుష్ప్రవర్తనకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఫిర్యాదుల నేపథ్యంలో 2016 నుంచి ఇప్పటివరకూ 48 మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించినట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్, ఉపాధ్యక్షురాలు(ప్రజా వ్యవహారాలు) ఐలీన్‌ నాటన్‌ వెల్లడించారు. వీరిలో 13 మంది సీనియర్‌ మేనేజర్, అంతకంటే ఉన్నతస్థాయి వ్యక్తులు ఉన్నారు. సాగనంపినవారిలో ఎవ్వరికీ ఎగ్జిట్‌ ప్యాకేజీ ఇవ్వలేదు. లైంగికవేధింపుల కారణంగా గూగుల్‌ నుంచి వైదొలిగిన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ సృష్టికర్త ఆండీ రూబీన్‌కు రూ.659.38 కోట్లు(90 మిలియన్‌ డాలర్లు) ఎగ్జిట్‌ ప్యాకేజీ ఇచ్చారని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది.

ఈ నేపథ్యంలో పిచాయ్, ఐలీన్‌ కంపెనీ ఉద్యోగులకు సంయుక్తంగా లేఖ రాశారు. ఉద్యోగులకు సురక్షితమైన పని ప్రదేశాన్ని కల్పించేందుకు గూగుల్‌ కట్టుబడి ఉందని లేఖలో పిచాయ్‌ పేర్కొన్నారు. బాధితుల గోప్యతను పరిరక్షించేందుకు వీలుగా వ్యక్తిగత వివరాలు చెప్పకుండానే ఫిర్యాదు చేసే అవకాశం కల్పిస్తున్నామని వెల్లడించారు. ఓ మహిళా ఉద్యోగిపై 2013లో హోటల్‌లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆండీ రూబీన్‌పై ఆరోపణలు వచ్చాయి. దీంతో మరుసటి ఏడాది కంపెనీ నుంచి తప్పుకున్న ఆయనకు గూగుల్‌ వీడ్కోలు పలికిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక కథనాన్ని ప్రచురించింది. తన ఇష్టప్రకారమే గూగుల్‌ను వీడినట్లు రూబీన్‌ వివరణ ఇచ్చారు.

మరిన్ని వార్తలు