యూరప్‌లో గూగుల్‌ యాప్స్‌కు చార్జీ

21 Oct, 2018 02:19 IST|Sakshi

శాన్‌ఫ్రాన్సిస్కో: యూరప్‌లో స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులకు షాకిచ్చేందుకు టెక్నాలజీ దిగ్గజం గూగుల్‌ సిద్ధమైంది. తమ ఉత్పత్తులైన ప్లే స్టోర్, జీ–మెయిల్, యూట్యూబ్, గూగుల్‌ మ్యాప్స్‌ వంటి ఫీచర్లు ఇకపై కావాలనుకుంటే ఒక్కో ఫోన్‌కు లైసెన్సు ఫీజుగా రూ.2,939(40 డాలర్ల)ను వసూలు చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్లేస్టోర్‌ నుంచి ఏ యాప్‌నైనా డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే గూగుల్‌ బండిల్‌ను తప్పనిసరిగా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దీన్ని చట్టవ్యతిరేకంగా ప్రకటించిన యూరప్‌ అధికారులు.. గూగుల్‌పై ఏకంగా రూ.36,737 కోట్ల(5.1 బిలియన్‌ డాలర్ల) భారీ జరిమానా విధించారు. ఈ నేపథ్యంలో సంస్కరణలు చేపట్టిన గూగుల్‌.. క్రోమ్, గూగుల్‌ సెర్చింజన్‌ ఇన్‌స్టాల్‌ చేయాల్సిన అవసరం లేకుండానే ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్స్‌ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. తాము వసూలు చేసే లైసెన్సు ఫీజులు యూరప్‌లో దేశాలు, మొబైల్‌ ఫోన్లను బట్టి మారుతాయని వెల్లడించింది. ఈ మార్పులు అక్టోబర్‌ 29 నుంచి అమల్లోకి వస్తాయనీ.. లైసెన్సు ఫీజులను 2019, ఫిబ్రవరి 1 నుంచి వసూలు చేస్తామని పేర్కొంది.

మరిన్ని వార్తలు