'సైకో' పితామహుడికి గూగుల్ ఘన నివాళి

6 May, 2016 13:55 IST|Sakshi
'సైకో' పితామహుడికి గూగుల్ ఘన నివాళి

'ఫాదర్ ఆఫ్ మోడ్రన్ సైకాలజీ'గా ఖ్యాతి పొందిన ప్రముఖ సైకాలజిస్ట్ సిగ్మండ్ ఫ్రాయిడ్ కు దిగ్గజ సెర్చ్ ఇంజన్ గూగుల్ ఘనంగా నివాళులు అర్పించింది. శుక్రవారం (మే 6న) ఫ్రాయిడ్ 160వ జయంతిని పురస్కరించుకుని ఆయన డూగుల్ ను రూపొందించింది. 'మనిషి మనస్సులో 'అ చేతనం' (అన్‌ కాన్షెసినెస్‌) అనేది ఉంటుంది. అది మన ప్రవర్తనను మనకు తెలియకుండానే ప్రభావితం చేస్తుంది' అన్న ఫ్రాయిడ్ విశ్లేషణ.. మనస్తత్వ విశ్లేషణలో తారకమంత్రమైంది. సిగ్మండ్‌ ఫ్రాయిడ్‌ 1856, మే 6న జెకేస్లోవేకియాలోని ఫ్రీ బెర్గ్‌లో జన్మించారు.1860లో వారి కుటుంబ మంతా వియన్నాకు తరలిపోయింది. పేదరికంలోనూ కష్టపడి చదివి గ్రీస్‌, లాటిన్‌, గణితం, ప్రకృతి శాస్త్రాలు,చరిత్రలను వంటపట్టించుకున్న ఫ్రాయిడ్.. 1873లో వియన్నా విశ్వవిద్యాలయంలో వైద్యశాస్త్రంలో చేరాడు. నాటికి అదే వైద్యశాస్త్రంలో ప్రపంచ రాజధాని.

మానసిక రుగ్మతులకు సరైన చికిత్స చేయడానికి దోహదపడే క్లినికల్‌ న్యూరాలజీకి సంబంధించి చాలా రకాల అధ్యయనం చేసిన ఫ్రాయిడ్.. న్యూరాలజీ, మెదడు పని చేసే విధానం గురించి అనేక పరిశోధక పత్రాలు ప్రచురించారు.'సైకో అనాలసిస్‌' అన్న పదం వాడిందీ, ఆ అంశం ఒక సబ్జెక్టుగా అభివృద్ధి చేసిందీ ఫ్రాయిడ్‌. 1905లో ఫ్రాయిడ్‌ ప్రతిపాదించిన థియరీ ఆఫ్‌ సెక్యువాలిటీ అంశం మీద ప్రచురించబడిన మూడు వ్యాసాలు తీవ్రమైన ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. అదే సమయం లో సైకో అనాలసిస్‌ను ఫ్రాయిడ్‌ ఒక థెరపీగా ప్రతిపాదిస్తూ వ్యాసాలు రాశారాయన. మెదడు పనితీరుమీద అనేక పరిశోధనలు చేసిన ఆయన 1939, సెప్టెంబరు 23న కన్నుమూశారు.

 

మరిన్ని వార్తలు