టెక్‌ దిగ్గజాలకు కోవిడ్‌-19 సెగ

29 Feb, 2020 11:33 IST|Sakshi

కరోనా బారిన గూగుల్‌ ఉద్యోగి 

ఉద్యోగులకు ప్రయాణ ఆంక్షలు

 గూగుల్‌ : 'గ్లోబల్ న్యూస్ ఇనిషియేటివ్'  రద్దు

 ఫేస్‌బుక్‌ : ‘ఎఫ్8 డెవలపర్ కాన్ఫరెన్స్‌’ రద్దు

శాన్‌ఫ్రాన్సిస్కో: ప్రపంచ దేశాల్లో ప్రకంపనలు రేపుతున్న కోవిడ్‌-19 (కరోనావైరస్‌) గ్లోబల్‌ టెక్‌ కంపెనీలను కూడా వణికిస్తోంది. తాజాగా టెక్‌ దిగ్గజం గూగుల్‌ ఉద్యోగి ఒకరు ఈ వైరస్‌ బారినపడ్డారు. స్విట్జర్లాండ్‌లోని జూరిచ్ కార్యాలయంలో చాలా పరిమితం సమయాన్ని గడిపిన ఒక ఉద్యోగికి కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని గూగుల్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజారోగ్య అధికారుల సలహాలను అనుసరించి, అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామనీ, ప్రతి ఉద్యోగి ఆరోగ్యం, భద్రతకు తాము మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని వెల్లడించింది. అయితే ఆఫీసును మూసి వేయలేదని  పేర్కొంది. ఇరాన్, ఇటలీ  చైనాకు ప్రయాణించే ఉద్యోగులను పరిమితం  చేయడంతోపాటు,  జపాన్,  దక్షిణ కొరియాకు ఆంక్షలను త్వరలోనే అమలు చేయనున్నామని  కంపెనీ తెలిపింది. 

కాగా కోవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే అమెజాన్‌ తన ఉద్యోగుల విమాన ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. అలాగే ఏప్రిల్‌లో ఉత్తర కాలిఫోర్నియాలో జరిగాల్సిన 'గ్లోబల్ న్యూస్ ఇనిషియేటివ్' శిఖరాగ్ర సమావేశాన్ని గూగుల్ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. దీనిపై విచారం వ్యక్తం చేసిన గూగుల్‌, తమ అతిథుల ఆరోగ్యం, శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తప్పలేదని వెల్లడించింది. అటు సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్  కూడా మేలో  జరగాల్సిన తన ప్రధాన ఎఫ్ 8 డెవలపర్ సమావేశాన్ని నిలిపివేసింది. కరోనావైరస్ 57 దేశాలకు చేరుకోవడంతో వైరస్ వల్ల ప్రపంచ ప్రభావం వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ శుక్రవారం  ప్రకటించిన  సంగతి తెలిసిందే. (కోవిడ్‌-19  : ఫేస్‌బుక్‌ కొరడా)

మరిన్ని వార్తలు