గూగుల్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ఆందోళన

23 Nov, 2019 20:22 IST|Sakshi

శాన్ ఫ్రాన్సిస్కొ : శాన్‌ ఫ్రాన్సిస్కోలోని గూగుల్‌ ప్రధాన కార్యాలయం ముందు ఆ సంస్థకు చెందిన ఉద్యోగులు శుక్రవారం ఆందోళన నిర్వహించారు. ఏ కారణం లేకుండానే ఇద్దరు ఉద్యోగులను సెలవుపై పంపడమేంటని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని దాదాపు 200 మందికి పైగా ఉద్యోగులు శుక్రవారం ఉదయం 11 గంటలకు తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా సెలవుపై పంపిన ఇద్దరిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

'సంస్థలో గత కొంతకాలంగా జరుగుతున్న  లైంగిక వేధింపులపై చర్యలు తీసుకోవాలని నేను, నా తోటి ఉద్యోగులతో కలిసి సంస్థకు వివరించాం. అదే సమయంలో పని వేళల విషయంలోనూ కొన్ని సంస్కరణలు చేయాలని అడిగాం. కానీ మా విన్నపాలను ఏవీ పట్టించుకోకపోగా నోరు మూసుకొని ఉండాలని బెదిరిస్తున్నారు. అంతటితో గాక తమకు ఎదురు తిరిగిన వారిని సెలవుల పేరుతో ఉద్యోగం నుంచి తీసేస్తున్నారని' సంస్థలో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న జాక్‌ జొరాతంగ్‌ వాపోయారు. వెంటనే సెలవుపై పంపిన ఇద్దరు ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాగా, ఈ నెల మొదట్లో ఇద్దరు ఉద్యోగులు కంపెనీలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు వారిని సెలవుపై పంపినట్లు గూగుల్‌ సంస్థ ప్రతినిధి మీడియాకు తెలిపారు.

మరిన్ని వార్తలు