కోరుకుంటే చాలు.. వచ్చి వాలిపోతుంది!

6 Nov, 2015 10:35 IST|Sakshi
కోరుకుంటే చాలు.. వచ్చి వాలిపోతుంది!

కొండమీది కోతైనా సరే.. కోరుకుంటే క్షణాల్లో మీ ముందు వచ్చి వాలిపోతుంది. ఇలాంటివి సహజంగా  పౌరాణిక సినిమాల్లో చూసుంటాం. కానీ ఇప్పుడు అటువంటి అద్భుతాలే మనముందు ఆవిష్కృతం కాబోతున్నాయి. మనసులో కోరుకోకపోయినా నోటిమాట ద్వారా చెబితేచాలు క్షణాల్లో మనకు కావాల్సింది మనముందు ప్రత్యక్షమవుతుంది. ఇదెలా సాధ్యం? అనే సందేహం మనిషి బుర్రకు కలగడం సహజం. కానీ అదే బుర్ర ఈ అద్భుతాన్ని సాకారం చేస్తోంది. డ్రోన్ డెలివరీ.. ఆ వివరాలేంటో ఓసారి చదవండి...
 
అంటే ఏంటీ..?: మనకు నచ్చిన వస్తువును సెలెక్ట్ చేసుకొని, ఆర్డరిస్తే కొరియర్ కంపెనీల ద్వారా సరుకు మన ఇంటికి చేరేది. ఇందుకు చాలా సమయమే పడుతోంది. ఈ సమస్యను అధిగమించేందుకు అభివృద్ధి చెందుతున్న వ్యవస్థే ‘డ్రోన్ డెలివరీ’. ఇప్పటికే రకరకాల అవసరాలకు డ్రోన్‌లను వాడుతున్నారు. ఇకపై ఈ-కామర్స్ రంగంలో కూడా డ్రోన్‌లను వినియోగించడం ద్వారా తమ సేవలను మరింత వేగవంతం చేయాలని ఆన్‌లైన్ దిగ్గజ కంపెనీలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి.
 
 రంగంలోకి గూగుల్: ఇంటర్నెట్ గురించి తెలిసిన ప్రతివారికి గూగుల్ గురించి పరిచయం చేయనక్కరలేదు. ఈ ప్రతిష్టాత్మక కంపెనీ ఇప్పుడు డ్రోన్ డెలివరీపై దృష్టిసారించింది. 2017 నాటికి పూర్తిస్థాయి సేవలందిస్తామని ప్రకటించింది. ‘ప్రాజెక్ట్ వింగ్’ పేరుతో డ్రోన్ డెలివరీ సేవలు అందించేందుకు తెరవెనుక పెద్ద ప్రయత్నమే చేస్తోంది. వాషింగ్టన్‌లో నిర్వహించిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోస్ కన్వెన్షన్‌లో గూగుల్ సంస్థ ప్రతినిధి డేవిడ్ వోస్ ఈ విషయాన్ని  వెల్లడించారు. గూగుల్ డ్రోన్ డెలివరీకి సంబంధించిన ప్రయోగాలను 2014లోనే ప్రారంభించింది. గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియాలోని సీక్రెటివ్ రీసెర్చ్ ల్యాబ్‌లో ఈ ప్రయోగాలు జరుగుతున్నాయని సమాచారం.
 
అత్యవసర సేవలకే...: ప్రస్తుతానికి అత్యవసర సేవల కోసమే ఈ డ్రోన్ డెలివరీ సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని గూగుల్ భావిస్తోంది. వైద్య పరికరాలు, మందులు వంటివాటిని ఆర్డరిచ్చిన మరుక్షణంలో సరఫరా చేసేందుకు డ్రోన్‌లను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఆ తర్వాత దశలవారీగా సేవలను ఇతర అవసరాల కోసం కూడా వినియోగించాలని నిర్ణయించారు. 

మరిన్ని వార్తలు