గొరిల్లా నుంచి బాలున్ని రక్షించడానికి..

29 May, 2016 12:37 IST|Sakshi
గొరిల్లా నుంచి బాలున్ని రక్షించడానికి..

ఒహియో: ప్రమాదవశాత్తూ గొరిల్లా ఎన్క్లోజర్లో పడ్డ బాలున్ని కాపాడడానికి 17 ఏళ్ల వయసున్న హరాంబే అనే గొరిళ్లాను జూ అధికారులు కాల్చి చంపారు. ఈ సంఘటన అమెరికాలో ఒహియోలోని సిన్సినాటీ జూ లో చోటుచేసుకుంది. జూ ను వీక్షించడానికి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ గొరిళ్లాలు ఉండే 10 నుంచి 12 అడుగుల లోతులో ఉన్న ఎన్క్లోజర్లో పడ్డాడు.  ఆ సమయంలో ఆక్కడ మొత్తం మూడు గొరిల్లాలు ఉన్నాయి. వీటిలో రెండుగొరిల్లాలను బాలుడికి దూరంగా అధికారులు బయటకు పంపారు.

కానీ అక్కడే ఉన్న మరో గొరిల్లా హరాంబే మాత్రం అక్కడి నుంచి వెళ్లలేదు. బాలున్ని పట్టుకుని ఈడ్చుకుంటూ అటూ ఇటూ విసరసాగింది.  దీంతో బాలున్ని కాపాడడానికి వేరే దారి లేక గొరిల్లాను జూ అధికారులు కాల్చి చంపారు. గొరిల్లాను చంపిన సమయంలో బాలుడు గొరిల్లా రెండు కాళ్ల మధ్యలో ఉన్నాడు. తీవ్రగాయాలైన బాలున్ని దగ్గర్లోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి వీడియోను కూడా అధికారులు విడుదల చేశారు. అయితే గొరిల్లా బాలునితో దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలను అందులోంచి తీసేసిట్టు అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు