శ్రీలంక అధ్యక్షుడిగా గోటబయ రాజపక్స

17 Nov, 2019 12:41 IST|Sakshi

కొలంబో : శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో మహీంద్ర రాజపక్స సోదరుడు 'టర్మినేటర్' అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే గోటబయ రాజపక్స విజయం సాధించారు. ఆదివారం ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా.. కౌంటింగ్ ప్రతిదశలోనూ రాజపక్స తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. తన సమీప ప్రత్యర్థి, అధికార యూఎన్‌పీ నేత సజిత్ ప్రేమదాసపై పైచేయి సాధించారు. అధికారికంగా రాజపక్సే గెలుపును సాయంత్రానికల్లా ప్రకటించనున్నారు. అయితే రాజపక్స గెలిచినట్టు ఇటు ఎస్ఎల్‌పీపీ, యూఎన్‌పీలు ధృవీకరించాయి.

ఆదివారం ఉదయం 12 గంటల వరకూ లెక్కించిన ఐదు లక్షల ఓట్లలో రాజపక్స 52.87శాతం ఓట్లు గెలుచుకోగా, ఆయనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న అధికార పార్టీకి చెందిన గృహ మంత్రి సజిత్ ప్రేమదాసకు 44.4 శాతం వరకూ ఓట్లు వచ్చినట్టు తెలుస్తోంది. శనివారం నాడు ఎన్నికలు జరుగగా, ఆదివారం ఓట్ల లెక్కింపు కొనసాగుతోందని, 80 శాతం ఓట్లు పోల్ అయ్యాయని ఎలక్షన్ కమిషన్ చైర్మన్ మహీంద్ర దేశప్రియ వెల్లడించారు. గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన గోటబయ రాజపక్స 2009లో ఎల్‌టీటీఈని నిర్మూలించి 26 ఏళ్ల అంతర్యుద్ధానికి తెరదించినందకు ‘జాతీయ హీరో’గా నీరాజనాలు అందుకున్నారు. 1.6 కోట్ల మంది ఓటర్లున్న నేటి ఎన్నికల్లో 35 మంది అభ్యర్థులు పోటీ చేయడం ఓ విశేషం..

మరిన్ని వార్తలు