డోక్లాంలోకి మళ్లీ చైనా

27 Jul, 2018 04:23 IST|Sakshi

భారత్, భూటాన్‌ ప్రతిఘటించడం లేదు: అమెరికా

సరిహద్దుల్లో కొత్త నిర్మాణాల్లేవ్‌: భారత్‌

వాషింగ్టన్‌: డోక్లాం ప్రాంతంలోకి చైనా మరోసారి చాప కింద నీరులా ప్రవేశించిందని, దీన్ని ఇటు భారత్, భూటాన్‌ ప్రతిఘటించలేదని అమెరికా పేర్కొంది. గురువారం ఈ మేరకు అమెరికా ఉన్నతాధికారి ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై చైనా అక్రమంగా కృత్రిమ ద్వీపాలు నిర్మాణంపై అమెరికా కాంగ్రెస్‌లో చర్చ జరిగిన సందర్భంగా దక్షిణ, మధ్య ఆసియాల ప్రిన్సిపల్‌ డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ ఆఫ్‌ స్టేట్‌ అలైస్‌ వెల్స్‌ మాట్లాడారు. భారత్‌ సరిహద్దులో రోడ్ల నిర్మాణాన్ని చైనా వేగవంతం చేసిందన్నారు.

కాంగ్రెస్‌ సభ్యురాలు అన్‌ వాగ్నర్‌ మాట్లాడుతూ ‘డోక్లాం వివాదం సద్దుమణిగిన తర్వాత చైనా నెమ్మదిగా డోక్లాంలో తన కార్యకలాపాలను పునరుద్ధరించింది. ఈ విషయంపై భూటాన్, భారత్‌ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. హిమాలయ ప్రాంతంలో చైనా చర్యలు.. దక్షిణ చైనా సముద్రంపై ఆ దేశ విధానాలను గుర్తుకుతెస్తున్నాయి. మన వైఫల్యాల వల్ల దక్షిణ చైనా సముద్రంలో చైనా సైన్యం మోహరించింది. ఇప్పుడు హిమాలయ సరిహద్దుల్లో అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. దీనికి అంతర్జాతీయ స్పందనేంటి? అమెరికా ప్రభుత్వం దీనిపై ఏం చేయబోతోంది’అని వాగ్నర్‌ పశ్నించారు.

అది భారత్‌ సొంత విషయం
ఈ చర్చ సందర్భంగా వెల్స్‌ మాట్లాడుతూ దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రాల్లో ఉన్న అపార ఖనిజ సంపద వల్లే చైనా ఇలా చేస్తోందని వ్యాఖ్యానించారు. ‘ఉత్తర సరిహద్దులను సంరక్షించుకునేందుకు భారత్‌ తీవ్రంగా శ్రమిస్తోంది. అయినా డోక్లాం వివాదం భారత్‌కు చెందిన విషయం’ అని అన్నారు. గతేడాది జరిగిన డోక్లాం వివాదం దాదాపు 73 రోజుల పాటు కొనసాగిన సంగతి తెలిసిందే. భారత్, చైనా, భూటాన్‌ ట్రై జంక్షన్‌లో చైనా రోడ్డు నిర్మాణాలను చేపట్టడంపై భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. తర్వాత దౌత్యపరమైన చర్చలతో వివాదం సద్దుమణిగింది.

కొత్త నిర్మాణాల్లేవ్‌: భారత్‌
డోక్లాం ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలేవీ చోటుచేసుకోలేదని, అక్కడ యథాతథ స్థితి నెలకొని ఉందని భారత విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ స్పష్టం చేశారు. డోక్లాం దక్షిణ ప్రాంతంలో చైనా కొత్తగా రోడ్ల నిర్మాణం చేపడుతోందా అని రాజ్యసభలో వేసిన లిఖిత పూర్వక ప్రశ్నకు సింగ్‌ ఈ మేరకు బదులిచ్చారు. కిందటేడాది ఆగస్టు 28న డోక్లాం ప్రాంతంలో భారత్, చైనా రక్షణ దళాలు మోహరించినప్పటి నుంచీ ఎవరూ అక్కడ కొత్తగా ఏ నిర్మాణం చేపట్టలేదన్నారు.

మరిన్ని వార్తలు