కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!

16 Jul, 2016 17:56 IST|Sakshi
కంపెనీ సీఈవోకు ఉద్యోగుల గిఫ్ట్!

ఏ కంపెనీలోనైనా ఉద్యోగులకు యాజమాన్యం జీతాలు పెంచే పద్ధతి చూస్తాం. ఓ కంపెనీ సీఈవో మాత్రం తన ఉద్యోగులకు స్వంత జీతంలో కొంత భాగాన్ని ఉద్యోగులకు జీతం పెంచేందుకు వెచ్చించాడు. దాంతో సీఈవో తమపై చూపిస్తున్న అభిమానానికి ఉద్యోగులు ఫిదా అయిపోయారు. తమను ఉద్యోగులుగా కాక స్వంత మనుషులుగా గుర్తిస్తున్న సీఈవోను సైతం సంతోషపెట్టాలనుకున్నారు. అందుకే  సదరు సంస్థలో పనిచేసే ఉద్యోగులు వారి జీతాలనుంచీ సేకరించిన డబ్బుతో ఆయనకిష్టమైన బహుమతిని ఇచ్చి.. సర్ ప్రైజ్ చేశారు.

తన కంపెనీలో పనిచేస్తున్న 120 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి ఏడాదికి 70 వేల డాలర్ల జీతాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న గ్రేవిటీ కంపెనీ సీఈవో డాన్ ప్రైస్  పై ఉద్యోగులూ ప్రత్యేకాభిమానం ప్రదర్శించారు.  తమ జీతాల్లో కొంత డబ్బు సేకరించి ఆయనకిష్టమైన, అత్యంత ఖరీదైన టెల్సా కారును కొని, బహుమతిగా ఇచ్చారు. ఈ అనుకోని సందర్భానికి ఆనందంలో మునిగిపోయిన సదరు సీఈవో.. తన సంతోషాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. తనకు ఉద్యోగులు బహుమతిగా ఇచ్చిన కారు ఫోటోతో పాటు.. ఈ విషయాన్ని నేను నమ్మలేకపోతున్నానని, నిజంగా షాక్ తిన్నానని, ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదంటూ పోస్ట్ చేశాడు.  

గ్రేవిటీ కంపెనీ సీఈవోగా ఉన్న డాన్ ప్రైస్ వేతనం 11 లక్షల డాలర్లు. అయితే దాన్ని 70 వేలకు తగ్గించుకున్న ఆయన.. మిగిలిన మొత్తాన్ని సంస్థలోని ఉద్యోగుల వేతనాలను పెంచేందుకు వినియోగించాడు. కంపెనీలో ఉద్యోగులందరికీ కనీసం ఏడాదికి 70 వేల డాలర్లు ఉండాలంటూ ఆయన తీసుకున్న నిర్ణయం అప్పట్లో ప్రపంచం మొత్తాన్నే ఆకట్టుకుంది. అయితే ఉద్యోగుల మనసులో అంతటి స్థానాన్ని సంపాదించిన డాన్ ప్రైస్ స్వంత సోదరుడి నుంచి ఓ కేసును ఎదుర్కొంటున్నాడు. గ్రేవిటీ కంపెనీలో వాటాదారుడుగా సోదరుడు.. ప్రైస్ అత్యధిక జీతం పొందుతున్నాడని అతనిపై కేసు వేశాడు. అయితే మూడు వారాల విచారణను ఎదుర్కొన్న డాన్... సోదరుడి కేసులో ప్రతి విషయాన్నీ ఆధారాలు సమర్పిస్తూ దీటుగా ఎదుర్కొంటూ వచ్చాడు.  కేసు చివరి దశలో ఉండగా సంస్థ ఉద్యోగులకు భారీగా  వేతనాలను పెంచేశాడు.

మరిన్ని వార్తలు