గ్రీస్కు మరో తలపోటు

18 Aug, 2015 19:45 IST|Sakshi
ఆగస్టు 17 నాటి దృశ్యం: గ్రీస్ ద్వీపాల్లో ఒకటైన కోస్ లో ఓ స్థానిక స్వచ్ఛంద సంస్థ అందించే ఆహారం కోసం బారులు తీరిన శరణార్థులు

తాహతుకు మించి అప్పులు చేసి రుణదాతల నుంచి ఒత్తిడి ఎదుర్కొని.. కొత్త అప్పుతో తిరిగి తన ప్రస్థానాన్ని ప్రారంభించిన గ్రీస్కు మరో తలపోటు పెరిగింది. అంతర్యుద్ధంతో అట్టుడికిపోతోన్న లిబియా, సిరియా, ఆఫ్ఘన్ లాంటి దేశాల నుంచి పెద్ద సంఖ్యలో శరణార్థులు గ్రీస్కు తరలిరావడమే ఇందుకు కారణం.

ఇప్పటికే సంక్షేమ పథకాలు, పెన్షన్లలో భారీ కోతలు విధించి ఎలాగోలా కాలం నెట్టుకొస్తున్న సైప్రస్ ప్రభుత్వం.. వెల్లువలా దూసుకొస్తున్న వలసలను ఎలా అడ్డుకోవాలో అర్థంకాక మిన్నకుండిపోయింది. దీంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి హెచ్చరికలు జారీచేసింది.

ఐక్యరాజ్యసమితి శరణార్థుల సహాయ కమిషన్ (యూఎన్హెచ్సీఆర్) అధికార ప్రతినిధి విలియం స్ప్లిండ్లర్ మంగళవారం జెనీవాలో మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలను వెల్లడించారు. గడిచిన వారం రోజుల్లోనే దాదాపు 21 వేల మంది శరణార్థులు గ్రీస్ లోకి ప్రవేశించారని, జనవరి 1 నుంచి ఆగస్టు 14 వరకు గ్రీస్కు వచ్చిన వలసదారుల సంఖ్య 15 లక్షల వరకు ఉంటుందని చెప్పారు.

వీరంతా ఏజియన్ సముద్రం గుండా గ్రీస్ ద్వీపాల్లోకి ప్రవేశిస్తున్నారు. ప్రధాన భూభాగానికి తోడు దాదాపు 6 వేల ద్వీపాలు కూడా గ్రీస్ దేశంలో భాగంగా ఉన్నాయి. చెల్లాచెదురుగా విస్తరించిన ఈ ద్వీపాల వద్ద సైన్యాల మోహరింపు పరిమిత స్థాయిలో ఉండటం కూడా వలసదారుల పనిని సులువు చేసింది.

సాధారణంగా శరణార్థులు లిబియా తీరం నుంచి మధ్యదారా సముద్రం గుండా యూరప్కు చేరుకుంటారు. అయితే గత కొద్దికాలంగా ఆ మార్గంలో పడవ ప్రమాదాలు జరిగి భారీ సంఖ్యలో శరణార్థులు చనిపోయారు. దీంతో యూరప్ కు వలసపోయేందుకు శరణార్థులు కొత్త కొత్త మార్గాలను కనిపెడుతున్నారు. అటు ద్వీపాలతోపాటు ప్రధాన భూభాగంలోనూ భద్రతను కట్టుదిట్టం చేసి వలసలను నిరోధించకపోతే గ్రీస్కు  మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు విలియం స్ప్లిండ్లర్.

 

మరిన్ని వార్తలు