గ్రేటా 121 ఏళ్ల క్రితం అలా ఉందా?!

21 Nov, 2019 12:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ పర్యావరణ పరిరక్షణ కోసం స్వీడన్‌లో గళమెత్తి ప్రపంచంలోని వంద నగరాల్లో కొన్ని లక్షల గొంతలు తనలాగే గళమెత్తేలా స్ఫూర్తినిచ్చిన ‘క్లైమేట్‌ ఛేంజ్‌’ కార్యకర్త, 16 ఏళ్ల బాలిక గ్రేటా థన్‌బెర్గ్‌ నిజంగా ‘టైమ్‌ ట్రావెలరా (కాలంతోపాటు ఓ కాలం నుంచి మరో కాలంకు ప్రయాణించే శక్తి కలిగిన)’? సరిగ్గా 121 సంవత్సరాల క్రితం 1898లో కెనడాలోని యుకాన్‌ టెరిటరీలో ఇద్దరు పిల్లలతో కలిసి ఓ బాలిక ఓ బావి నుంచి నీళ్లు తోడుతున్న దృశ్యం ఫొటోను చూసినట్లయితే ఎవరైనా ఇలా ప్రశ్నించాల్సిందే. వాషింగ్టన్‌ యూనివర్సిటీ పురావస్తు విభాగంలో లభించిన ఓ ఫొటోను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పోస్ట్‌ చేయగా, అచ్చంగా ఆమె మన గ్రేటాలాగా ఉందంటూ మరో నెటిజన్‌ రెండు ఫొటోలను కలిపి పోస్ట్‌ చేయడంతో ఇప్పుడవి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

‘నిజంగా ఆమె టైమ్‌ ట్రావెలర్‌. మన భవిష్యత్తు రక్షించేందుకు గతం నుంచి ఆమె భవిష్యత్తులోకి వచ్చారు. బ్యాక్‌ టు ది వ్యూచర్‌ సినిమా ఇది సాధ్యమని చెబుతోంది’ అని ఒకరు ట్వీట్‌ చేయగా, పలువురు ఆయనతో ఏకీభవిస్తూ ట్వీట్‌ చేస్తున్నారు. ‘ఇదంతా ట్రాష్‌. కాకమ్మ కథలు మేము నమ్మం’ అన్నంటున్న వాళ్లు ఉన్నారు. ఏదేమైనా మన భవిష్యత్తును రక్షించేందుకు పోరాడుతున్నందున గ్రేటా నిజంగా ‘టైమ్‌ ట్రావెలర్‌’ అని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఫొటో మార్ఫింగ్‌ చేశారేమోనంటూ మరి కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు