జీఎస్టీ రోడ్మ్యాప్ విడుదల

5 Aug, 2016 07:08 IST|Sakshi
జీఎస్టీ రోడ్మ్యాప్ విడుదల

ఏప్రిల్ 1, 2017 నుంచి అమలయ్యేలా ప్రణాళిక
వీలైనంత త్వరగా జీఎస్టీ అమలుకు ప్రయత్నం: జైట్లీ

 న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లు రాజ్యసభ ఆమోదం పొందడంతో వీలైనంత త్వరగా అమలు చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. జీఎస్టీ అమలుకు ఏప్రిల్ 1, 2017ను లక్ష్యంగా నిర్ణయించిన కేంద్రం అందుకు పూర్తిస్థాయి రోడ్‌మ్యాప్‌ను గురువారం విడుదల చేసింది. పన్ను రేటుపై అందరికీ ఆమోదయోగ్య నిర్ణయమే తమ లక్ష్యమని ప్రకటించింది. కేంద్ర రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా మాట్లాడుతూ... రాబోయే 30 రోజుల్లో 50 శాతం రాష్ట్రాలు(దాదాపు 16) రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదిస్తాయని ఆశిస్తున్నామన్నారు. జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లును వచ్చేవారం ప్రారంభంలో లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బిల్లును లోక్‌సభ ఇంతకముందే ఆమోదించినా సవరణల నేపథ్యంలో మళ్లీ ఆమోదం పొందాలి.

 60 వేల మందికి ప్రత్యేక శిక్షణ.. అధియా రూపొందించిన రోడ్ మ్యాప్ ప్రకారం.. 60 వేలమంది రెవెన్యూ అధికారులకు జీఎస్టీ నిబంధనలు, ఐటీ వ్యవస్థపై శిక్షణనిస్తారు. డిసెంబర్ 2016లోగా శిక్షణ పూర్తయ్యాక ఐటీ సంబంధ మౌలికసదుపాయాల ఏర్పాటును మార్చి 2017లోగా పూర్తిచేస్తారు. ఐటీ (సాంకేతిక అంశాలు)పై అధికారులకు జీఎస్టీఎన్ (గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్‌వర్క్) శిక్షణనిస్తుంది. కేంద్ర, రాష్ట్రాలు ఏర్పాటు చేసే ఈ జీఎస్టీఎన్..  ఐటీ వ్యవస్థ, సేవలకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పన్ను చెల్లింపుదారులు, ఇతర వర్గాలకు సాయం అందిస్తుంది.

 మార్చి చివరికి అనుసంధానం
రోడ్ మ్యాప్ ప్రకారం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్(సీబీఈసీ), బ్యాంకులు, ఆర్బీఐ, రాష్ట్ర రెవెన్యూ విభాగాలు, రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ నెట్‌వర్క్‌ను డిసెంబర్, 2016 చివరికల్లా సిద్ధం చేస్తారు.  జనవరి-మార్చి, 2017 మధ్యలో నెట్‌వర్క్ అనుసంధానంతో పాటు పరీక్షిస్తారు. ప్రస్తుత వ్యాట్, సేవా పన్ను , కేంద్ర ఎక్సైజ్ పన్ను డీలర్లు జీఎస్టీ కోసం కొత్తగా నమోదు చేసుకోనక్కర్లేదు. ప్రస్తుతమున్న సమాచారమే జీఎస్టీ వ్యవస్థలో పొందుపరుస్తారు.  కొత్త డీలర్ల కోసం ఆన్‌లైన్‌లో ఒక్క దరఖాస్తు సమర్పిస్తే, మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు.   జీఎస్టీ రిటర్న్స్ విషయంలో కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి కేవలం ఒక్క దరఖాస్తు దాఖలు చేస్తే సరిపోతుంది.

 రిటర్న్స్ కోసం నాలుగు దరఖాస్తులే..
సగటు పన్ను చెల్లింపుదారులు సరఫరా రిటర్న్స్, అమ్మకాల రిటర్న్స్, నెలవారీ, వార్షిక రిటర్న్స్‌ల దాఖలుకు నాలుగు దరఖాస్తులు సమర్పిస్తే చాలు. సరఫరా రిటర్న్‌ను ప్రతి నెల 10న సమర్పించాల్సి ఉండగా, ఆ సమాచారాన్నీ పేర్కొంటూ అమ్మకపు రిటర్న్ ను ప్రతి నెలా 15న దాఖలు చేయాలి. ఈ మొ త్తం వివరాలు నెలవారీ, వార్షిక రిటర్న్స్‌లో పొందుపరుస్తారు. చిన్నస్థాయి పన్ను చెల్లింపుదారుల కోసం నాలుగు నెలలకోసారి రిటర్న్స్ దాఖలు చేసేలా పథకం రూపొందించారు.

 సరైన పరిమితి లేకపోతే ఆర్థిక లోటు
జీఎస్టీ రేటుపై 18 శాతం పరిమితి విధించాలన్న కాంగ్రెస్ డిమాండ్‌పై జైట్లీ మాట్లాడుతూ.. ‘తమ సొంత కార్యక్రమాల నిర్వహణకు రాష్ట్రాలకు ఆదాయం అవసరం. అదే సమయంలో రాష్ట్రాలకు ఇచ్చేందుకు కేంద్రానికి నిధులు అవసరం. సరైన పరిమితి లేకపోతే ఆర్థిక లోటుకు దారితీస్తుంది. తక్కువ ఆదాయం వసూలు చేసి, ఖర్చు పెంచమని ప్రస్తుత ఆర్థికమంత్రి చెప్పలేరు’ అని జైట్లీ పేర్కొన్నారు.  ప్రస్తుతం 27 నుంచి 32 శాతం పన్ను రేట్లు ఉండగా అవి  దిగొస్తాయన్నారు. 

 22 శాతంతో ద్ర వ్యోల్బణ ప్రమాదం
జీఎస్టీ రేటు 22 శాతంగా ఉంటే ద్రవ్యోల్బణం ముప్పు ఉందని, 27 శాతంగా నిర్ణయిస్తే ఆత్మహత్యా సదృశ్యమేనని ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణియన్ అన్నారు. జీఎస్టీ 17 నుంచి 19 శాతం మధ్య ఉండాలని, ఆదాయం కోసం పన్ను విధానంపై భారం మోపకూడద ని చెప్పారు.  

 బిల్లు ఆమోదం రేసులో అస్సాం ముందంజ
జీఎస్టీ బిల్లును ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలిచేందుకు అస్సాం సిద్ధమవుతుంది.  ఆగస్టు 13తో ముగిసే ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు. వస్తు, సేవల పన్ను అమలుకు క ర్నాటక ప్రభుత్వం సిద్ధమని సీఎం సిద్ధరామయ్య చెప్పారు.

 మోదీది పార్లమెంటు ధిక్కారమే!: కాంగ్రెస్
న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ఆమోదం సందర్భంగా ఉభయసభల్లో దేనికీ హాజరుకాకుండా ప్రధాని మోదీ పార్లమెంటు ధిక్కారానికి పాల్పడ్డారని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రగతిశీలమైన  బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు ప్రధానికి కనీసం 5 నిమిషాల తీరిక దొరకలేదా? అని పార్టీ ప్రతినిధి జైరాం రమేశ్ ప్రశ్నించారు. ‘ప్రధాని విదేశీ పర్యటనలో లేరు. పార్లమెంటులోని తన కార్యాలయంలోనే ఉన్నారు. అయినా చర్చలో పాల్గొనకపోవటం పార్లమెంటు ధిక్కారమే!. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం సందర్భంగా ప్రధాని పార్లమెంటుకు హాజరు కాకపోవటం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే తొలిసారి’ అని  తెలిపారు. రాజ్యాంగమే తన భగవద్గీత అన్న ప్రధాని.. ఇప్పుడు రాజ్యాంగాన్నే అవమానిస్తున్నారన్నారు. గతేడాది లోక్‌సభలో జీఎస్టీ బిల్లు ఆమోద సందర్భంలోనూ ప్రధాని సభలో లేని విషయాన్ని గుర్తుచేశారు.

జీఎస్టీ రోడ్‌మ్యాప్ క్లుప్తంగా
1. సవరణ బిల్లుకు 30 రోజుల్లో కనీసం 16 రాష్ట్రాల ఆమోదం.
2. రాష్ట్రపతి సమ్మతి అనంతరం జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు.
3. నమూనా జీఎస్టీ నిబంధనలకు జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సు
4. సీజీఎస్టీ, ఐజీఎస్టీ(అంతరాష్ట్ర) చట్టాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం.
5. ఎస్జీఎస్టీ(రాష్ట్రాల జీఎస్టీ)కి అన్ని రాష్ట్రాల ఆమోదం.
6. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ చట్టాల ఆమోదం.
7. డిసెంబర్‌లోగా కేంద్ర, రాష్ట్ర అధికారులకు శిక్షణ పూర్తి
8. డిసెంబర్ 2016 నాటికి జీఎస్టీ సాఫ్ట్‌వేర్ సిద్ధం.
9. జనవరి- మార్చి, 2017 మధ్యలో జీఎస్టీ సాఫ్ట్‌వేర్ పరీక్షించడం, అనుసంధానం చేయడం.
10. సంబంధిత వర్గాలతో మార్చి, 2017లోగా సంప్రదింపులు పూర్తి.
11. జీఎస్టీ నిబంధనలపై మార్చి 31, 2017లోగా నోటిఫికేషన్
12. వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, కేంద్ర ఎక్సైజ్ పన్ను జీఎస్టీలో విలీనం

అన్నింటిని దృష్టిలో పెట్టుకునే పన్ను నిర్ణయం: జైట్లీ
వీలైనంత త్వరగా జీఎస్టీ అమలుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని  అరుణ్ జైట్లీ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ‘ఆర్థిక అవసరాలతో పాటు, పన్ను తక్కువ ఉండేలా అన్నింటిని దృష్టిలో పెట్టుకుని పన్నురేటుపై  జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుంది’ అని తెలిపారు. అమలుకు తుదిగడువు ఏప్రిల్, 2017పై స్పందిస్తూ... దృఢలక్ష్యం పెట్టుకుంటే ఎప్పటికీ మంచిదేనన్నారు. ‘ఏళ్లు గడిచేకొద్దీ పన్ను రేట్లు దిగొస్తాయి. అనేక నిత్యావసరాల ధరలు తగ్గుతాయి.  రోడ్ మ్యాప్‌ను పూర్తిచేయడంతో పాటు జీఎస్టీ అమలుకు ప్రయత్నిస్తాం. ఒకసారి జీఎస్టీ అమలైతే భారత్‌లో వ్యాపారం సులువవుతుంది. ఇది వర్తకులు, వ్యాపారవేత్తలు, ప్రజలకు ఉపయోగకరం. అన్ని పార్టీలకు చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ బిల్లుకు పూర్తి మద్దతు ప్రకటించాయి. చివరి దశ చర్చల్లో బిల్లులోని ప్రధాన అంశాలపై రాజీపడకుండా’ అని జైట్లీ చెప్పారు.

మరిన్ని వార్తలు