ఉప్పొంగిన లావా.. శవాల దిబ్బలుగా ఊళ్లు

5 Jun, 2018 13:24 IST|Sakshi

గ్వాటెమాలా: కమ్ముకొచ్చిన బూడిద.. ఉవ్వెత్తున్న ఎగసిపడ్డ లావా... అక్కడి ఊళ్లన్నింటిని కప్పేసి శవాల దిబ్బలుగా మార్చేశాయి. మధ్య అమెరికా దేశమైన గ్వాటెమాలాలో ఫ్యూగో అగ్నిపర్వతం సృష్టించిన భీభత్సంలో మృతుల సంఖ్య పెరిగిపోతోంది. రాజధాని గ్వాటెమాలా సిటీకి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అగ్నిపర్వతం ఆదివారం ఒక్కసారిగా లావాను ఎగజిమ్మింది. 

ఇప్పటిదాకా మొత్తం 65 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు ప్రకటించారు. మరో వంద మంది తీవ్రంగా గాయపడగా, 45 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. లావా వేడి వల్ల సహాయక సిబ్బంది ఓ గ్రామంలోకి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. అక్కడ కూడా ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ జాతీయ విపత్తు అధికారి కూడా మృతి చెందినట్లు ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

ఊహించని రీతిలో... ఆదివారం అగ్నిపర్వతం బద్ధలయ్యాక భారీగా బూడిద వెలువడింది. లావా కంటే వేగంగా దుమ్ము ధూళితో కూడిన బూడిద గ్రామాలపై విరుచుకుపడింది. ఈ దశలో ప్రజలకు ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. అగ్ని పర్వతం బద్ధలైన విషయం అర్థమయ్యే లోపు లావా ఊళ్లను ముంచెత్తింది. మనుషులతోపాటు మూగ జీవాలు కూడా పెద్ద ఎత్తున్న సజీవ దహనం అయ్యాయి. హృదయ విదారక దృశ్యాలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

సహాయక చర్యలు.. ఘోర ప్రమాదం అనంతరం గ్వాటెమాలాలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. మరోవైపు ముందస్తు చర్యల్లో భాగంగా సమీప గ్రామాలకు చెందిన 3 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు జాతీయ విపత్తు సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చన్న ప్రకటనతో తమ వారి కోసం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అధ్యక్షుడు జిమ్మీ మోరెల్స్‌.. మూడు రోజుల జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. 1974 తర్వాత సంభవించిన అతిపెద్ద అగ్నిపర్వత పేలుడు ఇదేనని నిపుణులు చెబుతున్నారు.

(సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని ఫోటోలు)...

మరిన్ని వార్తలు