కెమ్‌ ఛో ట్రంప్‌!

16 Feb, 2020 03:58 IST|Sakshi
హౌడీ–మోదీ సభలో చేతులు కలిపి నడుస్తున్న భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (ఫైల్‌)

మోతెరా స్టేడియంలో మోదీ, ట్రంప్‌ పాల్గొనే కార్యక్రమం

ప్రధాని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భద్రతకు ఎన్‌ఎస్‌జీ స్నైపర్లు 

పది వేలమంది పోలీసులతో భారీ బందోబస్తు

అహ్మదాబాద్‌/వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పర్యటనకు గుజరాత్‌ యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్‌ రాక సందర్భంగా కనీవినీ ఎరుగని స్థాయిలో భద్రతా చర్యలను చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం మోతెరాలో ప్రధాని మోదీ, ట్రంప్‌ చేపట్టే తొలి కార్యక్రమానికి ప్రభుత్వం ‘కెమ్‌ ఛో ట్రంప్‌’గా నామకరణం చేసింది. గుజరాతీలో ఈ మాటకు..‘ఎలా ఉన్నారు ట్రంప్‌?’ అని అర్థం.

గత ఏడాది అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాని మోదీ, ట్రంప్‌ పాల్గొన్న ‘హౌడీ మోదీ’ తరహాలోనే ఇది జరగనుంది. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులు, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులు అడుగుపెట్టిన దగ్గర్నుంచీ వారిని అనుక్షణం వెన్నాడి ఉండేందుకు జాతీయ భద్రతా దళం(ఎన్‌ఎస్‌జీ) స్నైపర్‌ బలగాలను మోహరించనుంది. ఎటువంటి అనూహ్య పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పది వేల మందికిపైగా పోలీసులను బందోబస్తుకు వినియోగిస్తోంది. ప్రముఖుల భద్రతలో స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్, నిఘా విభాగాలతోపాటు అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ విభాగం కూడా పాలుపంచుకోనున్నాయి.

22 కిలోమీటర్ల రోడ్‌ షో
ఎయిర్‌పోర్టు ప్రాంతం, రోడ్‌ షో, సబర్మతి ఆశ్రమం, మోతెరా స్టేడియంలో భద్రతను అహ్మదాబాద్‌ పోలీసులు పర్యవేక్షిస్తారని పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌ పటేల్‌ వెల్లడించారు. ‘బందోబస్తులో 25 మంది ఐపీఎస్‌ అధికారులు, 65 మంది అసిస్టెంట్‌ కమిషనర్లు, 200 మంది పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు, 800 మంది సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, 10 వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నాం. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌(ఎస్‌పీజీ) ఇప్పటికే ఇక్కడికి చేరుకుంది. ఎన్‌ఎస్‌జీ స్నైపర్‌ యూనిట్లను కీలక ప్రాంతాల్లో మోహరించాం. బాంబు స్క్వాడ్‌లు నగరంలో ఇప్పటికే తమ పని ప్రారంభించాయి.

అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి సబర్మతి ఆశ్రమం, అటునుంచి మోతెరా స్టేడియం వరకు మొత్తం 22 కిలోమీటర్లు సాగే రోడ్‌షోలో ఎన్‌ఎస్‌జీ స్నైపర్‌ యూనిట్లను మోహరించనున్నాం. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌ దళాలతోపాటు నిఘా విభాగం, సీక్రెట్‌ సర్వీస్‌ పోలీసులు నిఘాలో పాలుపంచుకుంటున్నారు. అహ్మదాబాద్‌లోని వివిధ హోటళ్లలో బస చేసిన కొత్త అతిథులను, ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నాం. రోడ్‌ షోతోపాటు స్టేడియం వద్ద అనుమానాస్పద వస్తువులు గానీ, వ్యక్తులు కనిపించినా తమకు తెలియజేసి, సహకరించాలి’ అని పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌ ప్రజలను కోరారు.

ఫేస్‌బుక్‌ ఇచ్చిన గౌరవం: ట్రంప్‌
సామాజిక మాధ్యమం ఫేస్‌బుక్‌ తనకు తొలిస్థానం, మోదీకి రెండో స్థానం ప్రకటించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ట్విట్టర్‌లో ప్రకటించారు. గత నెలలో దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాల సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ట్రంప్‌..ఫేస్‌బుక్‌ తనకు మొదటి స్థానం, భారత ప్రధాని మోదీకి రెండో స్థానం ఇవ్వడాన్ని ప్రస్తావించారు.మోదీ ఫేస్‌బుక్‌ ఖాతాలో 4.4 కోట్ల మంది ఫాలోవర్లు ఉండగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు 2.75 కోట్ల మంది ఫాలోవర్లున్నారు. లైక్‌ల దృష్ట్యా చూసినా ఇద్దరి మధ్య అంతరం భారీగా∙ఉంది. మోదీకి 4.45 కోట్ల లైక్‌లు వస్తుండగా, అందులో సగానికి కొద్దిగా ఎక్కువ అంటే 2.6 కోట్లు ట్రంప్‌కు వస్తుంటాయి.

రూ.800 కోట్లతో..
అహ్మదాబాద్‌లోని మోతెరాలో రూ.800 కోట్లతో 1.25 లక్షల మంది వీక్షించేందుకు వీలుగా నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియంను ట్రంప్‌తో కలిసి మోదీ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ‘కెమ్‌ ఛో ట్రంప్‌’గా నామకరణం చేశారు. అహ్మదాబాద్‌ విమానాశ్రయంలో ట్రంప్‌ దంపతులకు బలగాలు గౌరవ వందనం సమర్పిస్తాయి. ట్రంప్‌ నేతృత్వంలోని అమెరికా ప్రతినిధి బృందం ముందుగా సబర్మతిలోని గాంధీ ఆశ్రమానికి వెళ్లనుంది. ట్రంప్‌ దంపతులకు ప్రధాని మోదీ సబర్మతి ఆశ్రమ విశిష్టతను వివరించనున్నారు. అక్కడి నుంచి వారు ఇందిరా బ్రిడ్జి మీదుగా మోతెరా స్టేడియంకు చేరుకుంటారు.

నూతనంగా నిర్మించిన స్టేడియంలోని సుమారు 1.20 లక్షల మంది ప్రజలు, ప్రముఖులు వారికి స్వాగతం పలుకుతారని పోలీస్‌ డిప్యూటీ కమిషనర్‌ విజయ్‌ పటేల్‌ చెప్పారు. ‘ప్రభుత్వం పంపిన ప్రత్యేక ఆహ్వానంతో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు అక్కడికి వస్తున్నారు. కార్యక్రమం అనంతరం వీరంతా తిరిగి నిర్దేశిత మార్గాల్లో వెళ్లిపోతారు. స్టేడియం చుట్టూ ఒకటిన్నర కిలోమీటర్ల ప్రాంతాన్ని భద్రతా బలగాలు ఆధీనంలోకి తీసుకున్నాయి’ అని ఆయన తెలిపారు.. అహ్మదాబాద్‌ విమానాశ్రయం నుంచి సబర్మతి వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్‌షోలో కూడా ఎన్‌ఎస్‌జీ స్నైపర్‌ యూనిట్లను మోహరించనున్నారు. వేలాది మంది ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి అతిథులకు స్వాగతం పలకనున్నారు. ఈ మార్గంలో సాంస్కృతిక ఘనతను చాటే పలు చిత్రాలను ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు