నిన్ను చూస్తే అలా కన్పించడం లేదే!

15 Oct, 2018 18:34 IST|Sakshi

గురుత్వాకర్షణ తరంగాలకు సంబంధించి సరికొత్త విషయాలను ఆవిష్కరించిన శాస్త్రవేత్త కరణ్‌ జానీ, అతడి స్నేహితులకి అట్లాంటాలో అవమానం జరిగింది. తన ఇంటి పేరు, రూపం కారణంగా గర్భా వేడుకలో పాల్గొనకుండా నిర్వాహకులు అడ్డుకున్నారని సోషల్‌ మీడియాలో వరుస పోస్టులతో కరణ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అసలేం జరిగిందంటే... నవరాత్రుల సందర్భంగా అట్లాంటాలో జరుగుతున్న గర్భా వేడుకలో పాల్గొనేందుకు కరణ్‌ జానీ తన స్నేహితులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా వారి ఐడీ కార్డులను పరిశీలించిన ఆర్గనైజర్స్‌ వ్యవహరించిన తీరు తన స్నేహితురాలిని భయభ్రాంతులకు గురిచేసిందని కరణ్‌ పేర్కొన్నారు.

‘నేను, కొంకణీ ప్రాంతానికి చెందిన నా స్నేహితురాలు గర్భా వేడుకలో పాల్గొనేందుకు వెళ్లాం. మమ్మల్ని క్యూలో నిల్చోవాల్సిందిగా నిర్వాహకులు ఆదేశించారు. కానీ అకస్మాత్తుగా ఆమెను లాగి పడేసి.. మీ కార్యక్రమాలకు మేము రాలేదు కదా.. మరి నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు. మీకు ఇక్కడ ప్రవేశం లేదంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. అయితే తాను కూడా హిందువేనని.. కన్నడ మరాఠీనని చెప్పేందుకు తను ప్రయత్నించింది. ఆమె ఇలా చెప్పడంతో మా గుజరాతీ సోదరులు.. అసలు కన్నడ అంటే ఏంటి. నువ్వు ఇస్మాయిలీవి(ముస్లింవి) అంటూ ఆమెను గద్దించారు. నా మిగతా స్నేహితుల పరిస్థితి కూడా దాదాపుగా అదే విధంగా ఉంది. మొట్టమొదటి సారి గర్భా వేడుకను చూసేందుకు వచ్చిన వాళ్లకు... మా గుజరాతీ సోదరులు భయంకర అనుభవాన్ని మిగిల్చారు’ అంటూ కరణ్‌ జానీ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. కాగా వడోదరలో జన్మించిన కరణ్‌ అస్ట్రోఫిజిసిస్ట్‌గా గుర్తింపు పొందారు. గతేడాది ఫోర్బ్స్‌ మ్యాగజీన్‌ ప్రచురించిన అత్యంత శక్తిమంతమైన 30 మంది శాస్త్రవేత్తల జాబితాలో కరణ్‌ చోటు దక్కించుకున్నారు.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా