అమెరికాలో మనిషికో తుపాకి?

15 Feb, 2018 20:39 IST|Sakshi

న్యూయార్క్‌, అమెరికా : అమెరికాలో మూకుమ్మడి హత్యాకాండ జరిగిన ప్రతిసారీ తుపాకుల అమ్మకం, లైసెన్సుల జారీపై చర్చ నడుస్తుంది. ఈ ఆయుధాల నియంత్రణకు కాంగ్రెస్‌లో బిల్లులు ప్రవేశపెడతారు. ఆత్మరక్షణకు గన్లు ఉండాలనే జనం వెంటనే రంగంలోకి దిగి ప్రభుత్వం తమ చేతుల్లోంచి తుపాకులు లాక్కోబోతోందంటూ గగ్గోలు పెడతారు. చర్చ ఆగిపోతుంది. బిల్లులు చట్టసభల ఆమోదం పొందకుండానే నిలిచిపోతాయి.

మరే దేశంలో లేనంతగా అమెరికాలో తుపాకులతో జరిగే హింసలో ప్రజలు ప్రాణాలు విడుస్తూనే ఉంటారు. ఇదే తంతు కొన్నేళ్లుగా అగ్రరాజ్యంలో సాగుతోంది. ఎన్నికల రాజకీయాల్లో గన్ల నియంత్రణ ప్రధానాంశంగా ఉంటూనే ఉంది. తుపాకులతో సాగే సామూహిక హత్యలకు రాజకీయంగా పలుకుబడి ఉన్న అమెరికా జాతీయ రైఫిల్‌అసోసియేషన్‌(ఎన్‌ఆర్యే)ను మాత్రమే ఎక్కువ మంది నిందించడం కూడా ఆనవాయితీగా మారింది. అందుకే ఆధునిక ప్రపంచంలోని ఏ దేశమూ తుపాకి కాల్పులతో సాగే హింసలో అమెరికాకు దగ్గరలో లేదు. ఈ విషయంలో అవకాశాల స్వర్గం అన్ని పాశ్చాత్య దేశాలకు అందనంత దూరంలో ముందుంది.

తుపాకి హత్యలు కెనడా కన్నా అమెరికాలో ఆరు రెట్లు ఎక్కువ!
తుపాకి హత్యలు అమెరికాలో కెనడా కంటే ఆరు రెట్లు, స్వీడన్‌కన్నా ఏడు రెట్లు, జర్మనీతో పోల్చితే 11 రెట్లు ఎక్కువని ఐక్యరాజ్యసమితి లెక్కలు చెబుతున్నాయి. అత్యధిక తుపాకి చావుల కారణంగా మొత్తం హత్యల విషయంలో అమెరికా ఇతర దేశాల కన్నా ముందుంది. 2012లో అభివృద్ధిచెందిన దేశాల్లో తుపాకులతో చేసిన హత్యలపై ఐరాస మానవాభివృద్ధి సూచీ గణాంకాలు కూడా అమెరికా ఆధిపత్యాన్నే సూచిస్తున్నాయి.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జర్మనీ, ఆస్ట్రియా, డెన్మార్క్, హాలండ్, స్వీడన్, ఫిన్లాండ్, ఐర్లండ్, కెనడా, లగ్జెంబర్గ్, బెల్జియం, స్విట్జర్లాండ్‌లు ఈ హత్యల్లో అమెరికా తర్వాత వరుసలో నిలుస్తాయి. 2012లో ప్రతి పది లక్షల మందికి అమెరికాలో 29.7 మంది తుపాకి కాల్పుల్లో మరణించారు. రెండో స్థానంలో ఉన్న స్విట్జర్లాండ్‌లో 7.7 మంది తుపాకి గుళ్లకు బలయ్యారు. ఈ 14 దేశాల జాబితాలోఏడో స్థానంలో ఉన్న ఫిన్లండ్‌లో 4.5 మంది, చివరి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో 1.4 మంది ప్రాణాలు కోల్పోయారు.  

అమెరికాలో ఇన్ని హత్యలకు పౌరుల చేతుల్లో ఉన్న తుపాకులే కారణం!
చిన్నాపెద్దా తుపాకి హత్యలు అమెరికాలోనే అత్యధికంగా జరగడానికి ప్రధాన కారణం ప్రైవేటు వ్యక్తుల(పౌరుల) చేతుల్లో ఉన్నన్ని ఈ ఆయుధాలు మరే దేశంలోనూ లేవు. 2007లో ప్రతి వంద మంది పౌరుల దగ్గర సగటున 88.8 తుపాకులున్నాయి. అంటే వయోజనులకు సగటున ఒకటి కన్నా ఎక్కువ గన్లు ఉన్నట్టు భావించాలి.

ఈ విషయంలో రెండోస్థానం అంతర్యుద్ధంతో కుదేలవుతున్న యెమెన్‌ది. ఈ అరబ్‌దేశంలో 100 మందికి 54.8 తుపాకులున్నాయి. ప్రపంచ జనాభాలో అమెరికాది 4.43 శాతం కాగా, ప్రపంచంలోని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న మొత్తం తుపాకుల్లో 42 శాతం అమెరికన్ల దగ్గరున్నాయి. వయసొచ్చిన ప్రతి అమెరికన్‌చేతిలో తుపాకి ఉందనుకోకూడదు. సంపద మాదిరిగానే తుపాకులు కూడా అత్యధిక శాతం కొందరి దగ్గరే కేంద్రీకృతమయి ఉన్నాయి.

తుపాకులపై తెల్లవారికే ఎక్కువ మోజు!
అనేక అమెరికా రాష్ట్రాల్లో 1618 ఏళ్లు నిండిన పౌరులందరూ రైఫిళ్లు, గన్లు కొనుక్కోవచ్చు. కాని, జనాభాలో అత్యధికశాతమున్న(దాదాపు 70 శాతం) శ్వేతజాతీయులే తుపాకులు కలిగి ఉండడానికి ఇష్టపడతారని అనేక సర్వేలు చెబుతున్నాయి. తెల్లజాతివారిలో కూడా మధ‍్య వయసు నుంచి వృద్ధుల దగ్గరే ఈ ఆయుధాలు ఎక్కువుంటాయి. ఇటీవలి కాలంలో యువకులకు తుపాకులపై మోజు బాగా తగ్గిపోయింది. నల్లజాతివారు, ముస్లింలు వంటి ఇతర శ్వేతేతర జాతులవారి దగ్గరుండే తుపాకుల సంఖ్య చాలా తక్కువ.

బరాక్‌ఒబామా అధ్యక్షునిగా ఉన్న ఎనిమిదేళ్లలో సామూహిక హత్యాకాండలు ఎక్కువ జరిగాయి. ఆ రోజుల్లో తుపాకుల నియంత్రణకు డిమాండ్‌బాగా పెరిగింది. ఎక్కడ గన్ల కొనుగోలుపై ఆంక్షలు పెడతారనే భయంతో శ్వేతజాతీయులు భారీగా అప్పుడు తుపాకులు కొనుగోలు చేశారు. గన్ల నియంత్రణను వ్యతిరేకించే రిపబ్లికర్‌పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ట్రంప్‌అధ్యక్షుడయ్యాక తుపాకుల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.

తుపాకులు కలిగి ఉండే హక్కును కాపాడుకోవాలనే బలమైన కాంక్ష శ్వేత జాతీయుల్లో ఉన్నందునే తుపాకుల అమ్మకాలపై ఆంక్షలు పెట్టడం కుదరడం లేదు. గన్లు కలిగి ఉండడం వ్యక్తిగత స్వాతంత్య్రంలో భాగమని మెజారిటీ ప్రజలు నమ్మినంత కాలం తుపాకుల నియంత్రణ జరగదని సామాజికవేత్తలు నమ్ముతున్నారు. (సాక్షి నాలెడ్జ్‌సెంటర్‌)

మరిన్ని వార్తలు