అమెరికాలో పెరుగుతున్న తుపాకుల అమ్మకాలు

8 Sep, 2016 17:50 IST|Sakshi
అమెరికాలో పెరుగుతున్న తుపాకుల అమ్మకాలు

అమెరికాలో తుపాకుల అమ్మకాలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులోనే తుపాకుల కొనుగోలు కోసం 18,53,815 మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని, ఇది గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఆరు శాతం ఎక్కువని ఎఫ్‌బీఐ అధికారులు తెలిపారు. దరఖాస్తులు వచ్చినంత మాత్రానే అంతమేర తుపాకుల అమ్మకాలు ఉంటాయని భావించలేమని.. అయినా తుపాకుల కొనుగోలుకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ దరఖాస్తుల సంఖ్య సూచిస్తోంది అధికారులు తెలిపారు.

తుపాకుల కోసం కొనుగోలుదారులు ముందుగా డీలర్లకు దరఖాస్తు చేసుకోవాలి. అందులో తమ వ్యక్తిగత వివరాలతోపాటు చిరునామాను, దాన్ని ధ్రువీకరించే పత్రాలను సమర్పించాలి. కొనుగోలుదారుల నేరచరిత్రను తెలుసుకోవడం కోసం డీలర్లు ఆ దరఖాస్తులను ఎఫ్‌బీఐ తనిఖీకి పంపుతారు. సర్వసాధారణంగా ఒకటి, అరా మినహా అన్ని దరఖాస్తులకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది.

ఇటీవలి కాలంలో అమెరికాలో కాల్పుల ఘటనలు పెరిగిపోవడంతో భయాందోళనలకు గురవుతున్న ప్రజలు ఆత్మరక్షణ కోసం తుపాకుల కొనుగోలుకు పోటీ పడుతున్నారని ఎఫ్‌బీఐ అధికారులు చెబుతున్నారు. అలాగే కాల్పుల ఘటనలు జరిగినప్పుడల్లా చట్టాలు మరింత కఠినతరం అవుతాయేమోనన్న ఆందోళనతో కూడా కొందరు ఇప్పుడే తుపాకులు కొనేసుకోవాలని భావిస్తుండొచ్చన్నారు. దేశంలో తుపాకుల అమ్మకాలు పెరగడానికి దేశాధ్యక్ష ఎన్నికలు కూడా ఒక కారణమేనని చెబుతున్నారు. తాను అధికారంలోకి వస్తే తుపాకుల అమ్మకాలను మరింత కఠినతరం చేస్తామని, దేశంలో జరిగే కాల్పుల ఘటనలకు అమ్మకందార్లను కూడా బాధ్యులను చేస్తామని డెమోక్రట్ల తరఫున దేశాధ్యక్ష పదవికి పోటీపడుతున్న హిల్లరీ క్లింటన్ ప్రకటించారు.

తుపాకులను విక్రయిస్తున్న అమెరికాలోని 'స్మిత్ అండ్ వెస్సెన్', 'స్టర్మ్ రూగర్' అనే ప్రముఖ కంపెనీల అమ్మకాలు కూడా ఈసారి భారీగా పెరిగిపోయాయి. స్మిత్ అండ్ వెస్సెన్ కంపెనీ అమ్మకాలు ఈసారి 40 శాతం పెరగ్గా,  రూగర్ కంపెనీ అమ్మకాలు 19శాతం పెరిగాయి.

మరిన్ని వార్తలు