మిలిటరీ అకాడమీపై బాంబు దాడి.. కాల్పులు

29 Jan, 2018 08:34 IST|Sakshi

కాబూల్‌ : ఉగ్రదాడితో అప్ఘనిస్థాన్‌ మరోసారి వణికిపోయింది.  కాబూల్‌లోని మిలిటరీ అకాడమీపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. బాంబు పేలుళ్లు, తుపాకుల కాల్పుల మోతతో అకాడమీ దద్దరిల్లి పోయింది. ఈ ఘటనలో ప్రాణ నష్టం భారీగానే సంభవించినట్లు తెలుస్తోంది. 

భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం మార్షల్‌ ఫాహిమ్‌ నేషనల్‌ ఢిపెన్స్‌ యూనివర్సిటీ అకాడమీపై ఐదుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.  రంగంలోకి దిగిన భద్రతా బలగాలు ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు యత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది. 

కాగా, పది రోజుల వ్యవధిలోనే ఉగ్రవాదులు కాబూల్‌ నగరంపై రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు. ఇంటర్‌కాంటినెంటల్‌ హోటల్‌పై జరిపిన దాడిలో 22 మంది ప్రాణాలు బలితీసుకున్న తాలిబన్లు.. రెండు రోజుల క్రితం అంబులెన్స్‌తో భారీ ఎత్తున్న బాంబు దాడి నిర్వహించి 100 మందికి పైగా పొట్టనబెట్టుకున్నారు. 

అఫ్ఘన్‌ మిలిటరీ అకాడమీలే లక్ష్యంగా ఉగ్రవాదులు గతంలో చాలాసార్లు దాడులకు పాల్పడ్డారు. గత ఏడాది అక్టోబర్‌లో మార్షల్‌ ఫాహిమ్‌ వద్దే బాంబు దాడి చోటు చేసుకోగా..  11 మంది సైనికులను మృతి చెందారు.

మరిన్ని వార్తలు