కీలక తీర్పు; సుప్రీంకోర్టు జడ్జిపై కాల్పులు

15 Apr, 2018 20:52 IST|Sakshi
పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ ఇజాజ్‌ ఉల్‌ ఎహసాన్‌(ఫైల్‌ ఫొటో)

లాహోర్‌: మాజీ ప్రధాని నవాజ్‌ షరీప్‌ అవినీతి కేసులను విచారిస్తోన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై హత్యాయత్నం పాకిస్తాన్‌లో తీవ్ర కలకలంరేపింది. లాహోర్‌లోని మోడల్‌ టౌన్‌లో నివసిస్తోన్న జస్టిస్‌ ఇజాజ్‌ ఉల్‌ ఎహసాన్‌ ఇంటిపై ఆదివారం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి పారిపోయారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టంగానీ, గాయపడటంగానీ జరగలేదు. జస్టిస్‌ ఎహసాన్‌.. నవాజ్‌తోపాటు ఆయన కుటుంబీకులపై నమోదైన కేసులను విచారిస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే తుది తీర్పు వెలువడనుండగా ఒక్కసారే కాల్పులు చోటుచేసుకోవడం పలు అనుమానాలకు తావిచ్చినట్లైంది. విషయం తెలుసుకున్న వెంటనే పాకిస్తాన్‌ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి షకీబ్‌ నిసార్‌.. కాల్పులు జరిగిన జడ్జి ఇంటికి వచ్చి పరిస్థితిని అడిగితెలుసుకున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఆయన‌.. దీని వెనకున్న కారణాలను కనిపెట్టాల్సిందిగా పోలీసులను ఆదేశించారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. జస్టిస్‌ ఎహసాన్‌ ఇంటి గేటు వద్ద ఒక బుల్లెట్‌ను, కిచెన్‌ డోర్‌కు తగిలిన మరో బుల్లెట్‌ను సేకరించారు. జడ్జిల నివాస సముదాయం చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కాల్పుల వ్యవహారం ఇటు రాజకీయంగానూ ప్రకంపనలు రేపుతున్నది. దుండగులను పట్టుకుని చట్టం ముందు నిలబెడతామని ప్రధాని అబ్బాసీ చెప్పగా, ఈ ఘటన దేశంలో దిగజారిన పరిస్థితులకు నిదర్శనమని విపక్షాలు మండిపడ్డాయి. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ సైతం ఈ ఘటనను ఖండించింది.

నవాజ్‌ కేసుల్లో ఆ జడ్జి కీలకం: నవాజ్‌ ప్రధాని పదవి కోల్పోవడంలోనూ జస్టిస్‌ ఎహసాన్‌ పాత్ర ఉండటం గమనార్హం. నవాజ్‌ భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని ‘పనామా పేపర్ల లీకేజీ’లో వెల్లడికావడంతో, ఆయనపై విచారణ చేపట్టి, గద్దెదిగాలని తీర్పిచ్చిన జడ్జిల బృందంలో జస్టిస్‌ ఎహసాన్‌ కూడా ఒకరు. ఆ తర్వాత నవాజ్‌, ఆయన కుమారులు హస్సేన్‌,హుస్సేన్‌, కుమార్తె మరియం, అల్లుడు మొహమ్మద్‌ సఫ్దార్‌లపై నమోదైన అక్రమాస్తుల కేసులను విచారిస్తున్నది కూడా జస్టిస్‌ ఎహసానే. ఆయా కేసుల తుది తీర్పులు వచ్చే వారం వెలువడే అవకాశంఉంది.

మరిన్ని వార్తలు