అచ్చం బిల్లా సినిమాలో చేసినట్లే దాడి

20 Jun, 2016 10:49 IST|Sakshi
అచ్చం బిల్లా సినిమాలో చేసినట్లే దాడి

రియో డిజనిరో: అచ్చం సినిమాలోలాగే.. బిల్లా సినిమా చూశారుగా.. అందులో గాయాలపాలయి పోలీసుల అదుపులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమ డాన్(ప్రభాస్)ను తీసుకొచ్చేందుకు అనుష్క బృందం ఓ ఆస్పత్రిపై దాడికి దిగి అతడిని విడిపించుకునే తీరుగా బ్రెజిల్ రాజధాని రియో డిజనిరోలోని ఓ ఆస్పత్రిపై కొంతమంది సాయుధులు దాడికి దిగారు. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మత్తుపదార్థాల చేరవేత దారుడిని విడిపించేందుకు పోలీసులతో తలపడ్డారు. ఈ క్రమంలో ఓ రోగి ప్రాణాలుకోల్పోగా మరొకరు గాయపడ్డారు. ఎట్టకేలకు తమ వాడిని ఆ సాయుధులు విడిపించుకుని వెళ్లారు.

రియోడిజనిరోలో సౌజా అగ్విర్ అనే ఆస్ప్రత్రిలో ఓ డ్రగ్స్ రవాణా దారు బుల్లెట్ గాయంతో చికిత్స పొందుతున్నాడు. అతడు ఇటీవల పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడికి చెందిన ఓ 20మంది ముఠా ఆయుధాలతో దిగారు. బయట పదిహేనుమంది కాపలా ఉండగా మరో ఐదుగురు ఆస్పత్రిలోకి చొరబడి కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఒకరు చనిపోయారు. ఈ ఘటనతో ఒక్కసారిగా పోలీసులు ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే త్వరలో జరగనున్న ఒలింపిక్స్ గేమ్స్లో గాయపడిన వారికి వైద్యం అందించేందుకు ఈ ఆస్పత్రిని కూడా ఎంపిక చేశారు. అలాంటి ఆస్పత్రిపై సాయుధులు దాడి చేయడాన్ని, ఆ దాడిని పోలీసులు కనిపెట్టలేకపోవడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు